కరీంనగర్‌లో మానవమృగాలు | 4 teens arrested in alleged gang rape in karinnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో మానవమృగాలు

Published Sun, Feb 28 2016 5:10 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

కరీంనగర్‌లో మానవమృగాలు - Sakshi

కరీంనగర్‌లో మానవమృగాలు

కరీంనగర్ జిల్లా వీణవంకలో దారుణం
► ఓ దళిత యువతిపై ముగ్గురు యువకుల అత్యాచారం..
► పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ కోసం వస్తుండగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్
► ‘అన్నా దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా’నన్నా వదలని కీచకులు
► దుర్మార్గాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన కామాంధులు
► ఈ వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతామని యువతికి బెదిరింపులు
► మళ్లీ వచ్చి కోరిక తీర్చాలంటూ వేధింపులు
►యువతి స్నేహితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు?
► విషయం తెలిసి యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన బంధువులు
► నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు

 
వీణవంక: కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. ‘అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా..’ అని దీనంగా వేడుకున్నా వదలకుండా సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ పైశాచికత్వాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ వెంటపడ్డారు.. లేకుంటే ఆ దృశ్యాలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించారు. ఈ వేధింపులు భరించలేని యువతి విషయూన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా... వారు పథకం ప్రకారం ఆ యువకులను గ్రామానికి రప్పించారు. పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో ఈ సంఘటన జరిగింది. ఆ యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నవారు కావడం గమనార్హం. లైంగికదాడికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
 
పోలీసు శిక్షణ శిబిరం నుంచి...
 వీణవంక మండల కేంద్రంలో స్థానిక పోలీసులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. మండలంలోని చల్లూరుకు చెందిన ఓ దళిత యువతితోపాటు శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గొట్టె శ్రీనివాస్ (23), కల్వల గ్రామానికి చెందిన ముద్దం రాకేశ్(19), ముద్దం అంజయ్య(20) అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌తో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. అతను మాయమాటలు చెప్పి యువతిని  ఈనెల 10న మధ్యాహ్నం కోచింగ్
 సెంటర్ నుంచి శంకరపట్నం మండలం కాచాపూర్ గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. రాకేశ్, అంజయ్యలకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకున్నాడు. ఆ గుట్ట వద్ద రెండేళ్ల కింద నడిచిన క్వారీకి సంబంధించిన ఓ రేకుల షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

'అన్నా.. నన్ను వదిలిపెట్టండి.. మీ కాళ్లు మొక్కుతా.. నేను చచ్చిపోతా..’.. అని ప్రాధేయపడినా కనికరించలేదు. తర్వాత అంజయ్య, రాకేశ్ కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం యువతిని వీణవంక బస్టాండ్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. మరుసటి రోజు నుంచి యువతి కోచింగ్‌కు వెళ్లడం లేదు. అయినా ఆ ముగ్గురు కీచకులు... మళ్లీ తమ కామవాంఛ తీర్చాలంటూ యువతిని వేధించడం ప్రారంభించారు. లేకుంటే వీడియోలను ఇంటర్‌నెట్‌లో బెదిరించారు. దీంతో జరిగిన ఘటనను యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు ఈ నెల 24న రాత్రి 10 గంటల సమయంలో యువతితో ఆ యువకులకు ఫోన్ చేరుుంచి, చల్లూరుకు పిలిపించారు. వారినుంచి సెల్‌ఫోన్ తీసుకొని చూడగా... లైంగికదాడి దృశ్యాలు కనిపించడంతో ఆగ్రహంతో చితకబాది, పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన యువకులను పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

 ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు?
 నిందితుల్లో ఒకడైన శ్రీనివాస్ బాధిత యువతితోపాటు ఎల్బాక గ్రామానికి చెందిన ఆమె స్నేహితురాలి(20)ను సైతం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె తప్పించుకుంది. శ్రీనివాస్ బలవంతంగా తన స్నేహితురాలిని తీసుకెళ్లాడని వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
నిందితులను చితకబాదిన మహిళలు

 ఎంజీఎం (వరంగల్): మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలువురు మహిళలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్సపొందుతున్న నిందితులను చితకబాదారు. అత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గులను కఠినంగా శిక్షించకుండా రాచమర్యాదలతో వైద్యం అందించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఫిర్యాదు ఇచ్చినా స్పందించకుండా బాధితులకు మరింత అన్యాయం చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌ఎస్ ఆశాలత ఒక ప్రకటనలో మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 కఠిన చర్యలు తీసుకోండి: ఈటల
 సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. దీనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని, ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 యువతిపై ఆర్మీ జవాను అకృత్యం
 ఓదెల: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఆర్మీ జవాను తన స్వగ్రామానికి చెందిన ఓ యువతి (19)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారయ్యాడు. ఐదు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా పొత్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మడక గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో మడక గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముంటోంది. ఈనెల 23న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆర్మీ జవాను మల్లేశ్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మల్లేశ్ పరారీలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే మల్లేశ్ అంతకుముందే ఈనెల 19న గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు వెళ్లి మహిళలపై దౌర్జన్యం చేసినట్లుగా కేసు నమోదైంది. ఈ రెండు కేసుల నుంచి నిందితుడిని తప్పించేందుకు గ్రామానికి చెందిన ఓ యువ నాయకుడు ప్రయత్నిస్తున్నాడని, అందువల్లే పోలీసులు ఈ ఘటనను కప్పిపుచ్చారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement