
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కారు బోల్తా కొట్టి కాల్వలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఫిరంగిపురం (గుంటూరు) : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు-తాళ్లూరు మధ్య వద్ద శనివారం సాయంత్రం జరిగింది.
అమరావతి నుంచి ఫిరంగిపురం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఖాసింబీ అనే మహిళ మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమె చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్న వీరంతా బక్రీద్ సందర్భంగా సొంత గ్రామం అయిన ఫిరంగిపురంకి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి చూసేందుకు వెళ్లారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు కాల్వలో బోల్తాపడటంతో అందులో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. కారులోకి నీరు ప్రవేశించటంతో అందులోని వారికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.