
ఆర్చరీ సందడి ఆరంభం
– నేటి నుంచి మూడురోజుల పాటు జాతీయ పోటీలు
– 4 కేటగిరీల్లో ఫీల్డ్ ఆర్చరీ నేషనల్స్ నిర్వహణ
– 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రాక
కడప స్పోర్ట్స్: కడప నగరం మరో జాతీయస్థాయి టోర్నమెంట్‌కు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి 19వరకు కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో 7వ జాతీయ ఫీల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్–2017 నిర్వహించనున్నారు. మూడురోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంటకు సంబంధించిన ఏర్పాట్లను ఫీల్డ్ ఆర్చరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సుభాష్‌చంద్ర నాయర్, ఉపాధ్యక్షుడు సంతోష్, ఏపీ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌రాజు, ప్రతినిధులు పర్యవేక్షించారు.
4 కేటగిరీల్లో పోటీలు..
అండర్–10, అండర్–14, సీనియర్స్, వెటరన్ కేటగిరీల్లో రికర్వ్‌రౌండ్, కాంపౌండ్ రౌండ్, బార్బో రౌండ్, ఉడన్ రౌండ్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. 17న సింగిల్ స్పాట్ రౌండ్, 18వ తేదీన 5 స్పాట్ రౌండ్, 19న మిక్స్‌డ్ స్పాట్ రౌండ్స్‌లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ అనంతరం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే భారతజట్టును ఎంపిక చేయనున్నారు.
పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రాక...
ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారు. గురువారం కడప నగరానికి పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు చేరుకున్నారు. వీరికి నిర్వాహకులు తగిన వసతులు ఏర్పాటు చేశారు.