
రక్తమోడిన రహదారులు
♦ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
♦ వేర్వేరు చోట్ల ఘటనలు
♦ ప్రజ్ఞాపూర్ వద్ద ముగ్గురు..
♦ ఔటర్‌పై ఇద్దరు.. దుర్మరణం
గజ్వేల్: రాజీవ్ రహదారిపై లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం...
వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆలేరు బాల్‌రాజు(28), ఏర్పుల రవీందర్(34), మల్లయ్య(56), కానుగుల కిష్టయ్యలు అదే గ్రామానికి చెందిన దేవరాయ రమేశ్ ఆటో తీసుకుని వ్యవసాయ బోరు మోటార్ల కోసం పైపులు కొనేందుకు గజ్వేల్‌కు వస్తున్నారు. మార్గమధ్యంలోని గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాఫూర్ ఆర్టీసీ డిపో సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మల్లయ్య(56) మృతి చెందగా, బాల్‌రాజు(28), ఏర్పుల రవీందర్(34) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా కిష్టయ్య, రమేశ్‌లు చికిత్స పొందుతున్నారు. వీరిలో బాల్‌రాజు, రవీందర్, రమేశ్‌లు హనుమాన్ మాల ధరించి ఉన్నారు. గజ్వేల్ ఎస్‌ఐ కమలాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హే.. హనుమాన్..!
గజ్వేల్: అప్పటివరకు వారంతా హనుమాన్ భజనల్లో మునిగితేలారు. భిక్షను పూర్తి చేసుకున్నారు... గజ్వేల్‌లో వ్యవసాయ బోరుబావుల కోసం పైపులు తేవడానికి ఆటోలో బయలు దేరారు. కానీ ఈ ప్రయాణమే తమకు ఆఖరి మజిలీ అవుతుందనుకోలేదు... విధి లారీ రూపంలో వెంటాడడంతో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి.
మృతుల పరిస్థితి ఇలా...
ప్రమాదంలో మరణించిన బాల్‌రాజుకు మూడేళ్ల క్రితం మానసతో వివాహం కాగా ఏడాదిన్నర కూతురు ఉంది.రెండెకరాలకుపైగా భూమి ఉంది. వ్యవసాయమే ఇతనికి ప్రధాన జీవనాధారం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య మానస దిక్కులేనిదైంది.
మరో మృతుడు ఏర్పుల రవీందర్ హమాలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య రేణుక, ఏడాదిన్నర కూతురు, మూడు నెలల బాబు ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న వీరు రవీందర్ మరణంతో రోడ్డున పడ్డారు.
మల్లయ్యకు ఎకరంలోపే భూమి ఉంది. భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు. వీరిలో ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. ఓ కూతురు వికలాంగురాలు. మల్లయ్య మరణంతో వీరంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
ఆసుపత్రికి తరలిన ఐనాపూర్ వాసులు
ప్రజ్ఞాపూర్ ఘటనలో మృతులు, క్షతగాత్రులంతా వరంగల్ జిల్లా ఐనాపూర్ వాసులే. విషయం తెలియడంతో ఐనాపూర్ సర్పంచ్ విజయేందర్‌తోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున గజ్వేల్‌కు చేరుకుని అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి తరలివెళ్లారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఔటర్‌పై ప్రమాదం: ఇద్దరి దుర్మరణం లారీని కంటెయినర్ ఢీకొనడంతో ప్రమాదం
పటాన్‌చెరు టౌన్: ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్ దుర్మరణం చెందారు. లారీ, కంటెయినర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా.. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కంటెయినర్ మూసాపేట (కంటెయినర్ కార్పొరేషన్) వైపు నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతానికి వెళ్తుంది. మండలంలోని పాటి పంచాయతీ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై లారీ, కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కంటెయినర్ నుజ్జునుజ్జయ్యింది. కంటెయినర్ డ్రైవర్ చెన్నప్ప, కంటెయినర్ క్లీనర్ సురేశ్ మరణించారు. క్లీనర్ మృతదేహం క్యాబిన్‌లో చిక్కుకుపోయింది. లారీలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందున్న లారీని చూసుకోకండా కంటెయినర్ డ్రైవర్ వెనక నుంచి వెళ్లి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.