
బల్దియాలో ఏడీఎంఏ ఆకస్మిక తనిఖీ
♦ అక్రమ లీజు ల్యాండ్‌లపై రికార్డుల పరిశీలన
♦ మీడియాను అనుమతించని..వివరాలు వెల్లడించని అధికారులు
♦బల్దియా అక్రమాలపై ఉన్నతాధికారుల నిఘా
ఆదిలాబాద్ కల్చరల్ :
ఆదిలాబాద్ బల్దియాలో ఏడీఎంఏ(అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్టేషన్, హైదరాబాద్) అధికారి అనురాధ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లీజు స్థలాలు, ప్రస్తుతం ఉన్న స్థలాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె తనిఖీకి వచ్చినట్లు సమాచారం. లీజు ల్యాండ్‌ల రికార్డుల జిరాక్స్ కాపీలు, ఫైళ్లను తీసుకెళ్లారు. బల్దియాలో రెండున్నరేళ్లుగా జరుగుతున్న అక్రమాల విషయంలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల కౌసల్య, విఠల్‌రావు షిండే స్థలంపై కోర్టు మున్సిపల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బల్దియా అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోగా పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం.
బల్దియాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా లీజు భూమి వివాదాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉన్న ఆక్రమణల తొలగింపు సైతం అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మాత్రమే ఆక్రమణలు తొలగించి మిగతా కట్టడాలను అలాగే ఉంచిన విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మీడియాను ఏడీఎంఏ అనురాధతో ట్లాడేందుకు అనుమతించలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. మీడియా ప్రశ్నించినప్పటికీ అమె సమాధానం చెప్పలేదు. మళ్లీ మాట్లాడతానని చెప్పి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాగా, మీడియాను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. ఇటీవల కాలంగా నేతల కన్ను లీజుల్యాండ్, ప్రభుత్వ స్థలాలపై పడినట్లుగా ఆరోపణలున్నాయి. టీపీవో, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్ అధికారులనువిచారించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ అలువేలు మంగతాయారు, మున్సిపల్ ఎంఈ నాగమల్లేశ్వర్‌రావు, ఏసీపీ నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.