అవినీతిపరులకు అందలం
-
నిట్‌లో భారీగా అక్రమాలు
-
నిర్ధారించిన సీబీఐ
-
బాధ్యులపై చర్యలకు సిఫారసు
-
మానవ వనరుల శాఖకు నివేదిక
-
అభియోగాలు ఉన్న వారికి కీలక పోస్టులు
-
వరంగల్ నిట్‌లో అడ్డగోలు నిర్ణయాలు
సాక్షి, హన్మకొండ :అవినీతి జరిగిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ పేర్కొంది. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అక్రమాలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు సూచించింది. నిర్ణయం మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఆరోపణలు ఉన్నవారిపై చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి... వీరికే కీలక పోస్టులు కట్టబెట్టారు. వరంగల్‌లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక సంస్థ(నిట్)లో ఈ వ్యవహారాలు జరిగాయి. వరంగల్‌లోని నిట్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.
నిట్‌లో చదువుకునే విద్యార్థుల వసతి కోసం 2006–07 విద్యా సంవత్సరంలో కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.200 కోట్లతో భారీ హాస్టల్ భవన సముదాయాన్ని నిర్మించారు. 3100 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా... 1కే, అల్ట్రా మెగా, ఉమెన్ హాస్టల్ నిర్మాణం చేపట్టారు. 2010 వరకు ఈ భవనాల నిర్మాణం కొనసాగింది. హాస్టల్ భవన నిర్మాణ సమయంలో ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు వరంగల్ నిట్ డైరెక్టరుగా వ్యవహరించారు. నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలు పాటించకపోవడం, నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, అంచనా వ్యయం పెంచినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ)తో విచారణ జరిపించింది. సీబీఐలోని అవినీతి నిరోధక విభాగం విచారణ నిర్వహించింది.
చర్యలకు సిఫారసు...
ఆరేళ్ల విచారణ అనంతరం సీబీఐ తొలి నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు అందించింది. 1కే హస్టల్ భవన నిర్మాణానికి సంబంధించి ఎనిమిది మంది వ్యక్తులు వ్యవహారశైలిపై సందేహాలు వ్యక్తం చేసింది. అవినీతి వ్యవహరంలో వీరి పాత్రపై తగిన(డాక్యుమెంట్, మౌఖిక) ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ 2016 జూన్ 13న లేఖ రాసింది. సీబీఐ నివేదికలో పేర్కొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవవనరుల శాఖ... వరంగల్ నిట్ డైరెక్టరుకు ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకోవాలని సీబీఐ సూచించిన ఎనిమిది మంది వ్యక్తుల్లో కొందరు ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ముగ్గురు వ్యక్తులు నిట్‌లో ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు.
బుట్టదాఖలు...
అవినీతి వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సీబీఐ, కేంద్ర మానవ వనరుల శాఖ చేసిన సిఫార్సులు నిట్ వరంగల్‌లో బుట్టదాఖలయ్యాయి. నిట్ ఇన్‌చార్జి డెరెక్టరుగా కొనసాగుతున్న ఆర్.వి.చలం ఈ ఆదేశాలు బేఖాతరు చేశారు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిన వ్యక్తులను అందలం ఎక్కించారు. జూలై చివరి వారంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ముగ్గురు ప్రొఫెసర్లలో ఒకరికి బోర్డ్ ఆఫ్ గవర్నర్‌లో సభ్యత్వం కల్పించారు. మరొకరికి విభాగ అధిపతి (హెచ్‌వోడీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్) అప్పగించారు. తీవ్ర ఆరోపణలు ఉన్న ప్రొఫెసర్‌ను ఏకంగా రిజిస్ట్రార్ పదవిని అప్పగించారు. నిట్ ఇన్‌చార్జ్ డైరెక్టరు తీసుకున్న ఈ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కీలక బాధ్యతలు
వరంగల్ నిట్‌లో అవినీతి వ్యవహారాల్లో... మూడు భవనాల నిర్మాణంపై విచారణ కొనసాగుతోంది. 1కే భవన నిర్మాణంపై సీబీఐ నివేదిక వెలువరించింది. అల్ట్రా మెగా, ఉమెన్ హాస్టళ్ల నిర్మాణాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణకు సంబంధించిన వ్యవహరాలు, శాఖాపరమైన చర్యలు తీసుకునే అధిలకారులు ఉన్న రిజిస్ట్రార్ పోస్టులోనే... ఆభియోగాలు ఉన్న వ్యక్తిని నియమించడం సందేహాలకు తావిస్తోంది. అవినీతి వ్యవహారాలను పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఆరోపణలు ఉంటే..?
– ఆర్‌వీ చలం, ఇన్‌చార్జీ డైరెక్టర్, నిట్, వరంగల్
అవినీతీ ఆరోపణలు ఉన్నంత మాత్రాన బాధ్యతలు అప్పగించకూడదా. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. వారిపై చర్యలు తీసుకోవాలంటూ నాకు ఆదేశాలు అందలేదు. ఛార్జీషీట్ ఫైల్ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను. కాలేజీ రోజువారీ వ్యవహారాలు సాఫీగా సాగేందుకు హెచ్‌వోడీ, రిజిస్ట్రార్ పదవులు అప్పగించాం. ఇందులో మరో ఉద్దేశం లేదు.