గిరిసీమలో రహ‘దారిద్య్రం’ | agency roads very bad | Sakshi
Sakshi News home page

గిరిసీమలో రహ‘దారిద్య్రం’

Published Sun, Oct 16 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

గిరిసీమలో రహ‘దారిద్య్రం’

గిరిసీమలో రహ‘దారిద్య్రం’

  • ఆపద ముంచుకొచ్చిన వేళా ‘పథం’ కరువు
  • తరాలుగా పీడిస్తున్న సమస్య సర్కార్ల నిర్లక్ష్యం
  • గిరిబిడ్డల దారి గోడు నేటికీ అరణ్యరోదనే
  • రంపచోడవరం :
    ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవేలనూ; వాటిపై దూసుకుపోయే వాహనాలనూ ప్రగతికి చిహ్నాలుగా చూపుతూ.. అవన్నీ తాము సాధించిన ఘనతలని ప్రచారం చేసుకునే ప్రభుత్వాలు– ఇప్పటికీ దారీతెన్నూ లేని గిరిసీమల దుస్థితిని పట్టించుకోవు. కొండకోనల నడుమనుండే ఓ గూడెం నుంచి.. పురిటినొప్పులు పడుతున్న ఓ నిండుగర్భిణిని చేరువలోని ఆస్పత్రికి తరలించాలంటే ఓ యజ్ఞం చేసినంతగా కష్టపడాల్సిన పరిస్థితే నేటికీ తూర్పు ఏజెన్సీలో అనేక గ్రామాల్లో నెలకొంది. అత్యవసరాల్లోనే కాదు.. ఏ చిన్ని అవసరానికైనా బాహ్యప్రపంచానికి పయనం కావలసిన వెనుకబాటుతనంతో ఉన్న మన్యగ్రామాలను తరాల తరబడి పీడిస్తున్న రహ‘దారిద్య్రం’ ఎందరు పాలకులు మారినా విరగడ కాలేదు. గిరిజనులు కోరేది.. పాలకులు గొప్పలు చెప్పుకొంటున్న మహా రహదారులను కాదు.. ప్రయాణం ప్రయాసపూరితం, ప్రమాదభరితం కాని కనీసస్థాయి బాటలనే! తూర్పు ఏజెన్సీలోని ఎన్నో రోడ్లు అత్యవసర సమయంలో కనీసం వాహనాలు కూడా ప్రయాణించలేనంత అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. ఐటీడీఏ ఉపాధిహామీ ప్రత్యేక ప్రాజెక్టు పేరుతో వీటీడీఏల ద్వారా నిర్మించిన రోడ్లను బినామీ కాంట్రాక్టర్‌లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి వేశారు. ఫలితంగా ప్రయాణ ం ‘కాకులు దూరని కీకారణ్యంలో గాలి పటాలను ఎగరేసినంత’ కష్టతరంగా మారింది. అటవీశాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. 
      
    ఏజెన్సీ రోడ్లు..  
    ఐటీడీఏ పరిధిలో :
    మెటల్‌ రోడ్లు : 237 కిలోమీటర్లు
    బీటీ రోడ్లు : 135 కిలోమీటర్లు 
    రోడ్లు, భవనాల శాఖ:
    రంపచోడవరం డివిజన్‌: 440 కిలోమీటర్లు
    చింతూరు డివిజన్‌: 270 కిలోమీటర్లు
     
    30 గ్రామాల వారికి ముప్పుతిప్పలే..
    గంగవరం నుంచి కొత్తపల్లి వరకు 18 కిలోమీటర్లు మేర ఆర్‌ అండ్‌ బి రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. రెండు సార్లు మరమ్మతులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. ఈ రోడ్లో మూడు చోట్ల కల్వర్టులు నిర్మించాలి. కానీ ఏళ్ళ తరబడి నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఈ రోడ్లో నిత్యం 30 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తారు.
     
    అడుగడుగునా గోతులే..
    రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి –చవిటిదిబ్బల రోడ్డు దుస్థితికి చేరుకుంది. ఈ రోడ్డుకు రెండుసార్లు మరమ్మతులు చేసికా ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఈ రోడ్లో రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన సుమారు 80 గ్రామాల గిరిజనులు రాకపోకలు సాగిస్తారు. వీరు ఐటీడీఏకి రావాలంటే దగ్గర మార్గం ఇదే. 40 కిలోమీటర్లున్న ఈ రోడ్డు అడుగడుగునా గోతులమయం కావడంతో ఆర్టీసీ బస్సు రాకపోకలను రంప రోడ్డుకి మార్చారు.
     
    నడవాలన్నా కష్టమే..
    కూనవరం –రేపాక మధ్య ఆరు కిలోమీటర్ల రోడ్డు కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారైంది. మన్యంలో లోతట్టు ప్రాంతంలోని ఈ రోడ్డు అత్యవసర సమయంలో మోటార్‌బైక్‌లు కూడా వెళ్లలేని దుస్థితిలో ఉంది. అధికారులకు మాత్రం ఈ రోడ్డు దుస్థితి పట్టడం లేదు. ఈ రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు దాటుతున్నా నిర్మాణం ఊసే లేదు.
     
     
    చినుకు పడితే దారే ఏరు
    మోతుగూడెం– డొంకరాయి మధ్య ఆర్‌ అండ్‌ బి రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే కడుపులో పేగులు కదిలిపోవల్సిందే. పొల్లూరు జంక్షన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వర్షం వస్తే మడుగులా మారుతుంది.
     
     
    ఆపద ముంచుకొచ్చినా వాహనం రాదు..
    రాజవొమ్మంగి నుంచి అప్పలరాజుపేట మీదుగా అమ్మిరేకుల వెళ్ళే 12 కిలోమీటర్ల రోడ్డు అధ్వానస్థితికి చేరింది. వర్షం వస్తే ఈ రోడ్లో నడిచి వెళ్లడం కూడా కష్టమే. గిరిజనులు అనారోగ్యం పాలైతే కనీసం అంబులెన్స్‌ కూడా వెళ్లే పరిస్థితి లేదు.
     
    మారేడుమిల్లి వయా ఆకుమామిడి కోట:
    మారేడుమిల్లి నుంచి ఆకుమామిడి కోట మీదుగా గుర్తేడు వెళ్లే  50 కిలోమీటర్ల రోడ్డు గోతులమయమైంది. మారేడుమిల్లి మండలం కుందాడ– మల్లిశాల వరకు 12 కిలోమీటర్ల రోడ్డు రాళ్లు లేచిపోయి ప్రమాదకరంగా మారింది. సున్నంపాడు– రామన్నవలస మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. 
     
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement