రెండు సార్లు తూచ్ .. ఈ 'సారీ' ?
ప్రతిసారీ ఇదే తంతు..
అసెంబ్లీ సమావేశాలకు ముందు స్పీకర్ పర్యటనలు
రాజధాని అమరావతిలో అనువైన భవవనాల పరిశీలన
మొదట ఏఎన్‌యూ, రెండోసారి తుళ్లూరు, ఇప్పుడు.. కేఎల్‌యూ
భూముల ధరల పెంపు ప్రక్రియకేనని గుసగుసలు
రాజధాని పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే పాలకుల ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. మాట ఇవ్వడం.. తప్పడం.. ఆపై ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అన్ని హామీలను తప్పక అమలు చేస్తామని సర్ది చెప్పడం రివాజుగా మారింది. అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయనగానే ముందు నవ్యాంధ్ర రాజధానిలోనే శాసనసభ సమావేశాలు అంటూ ప్రకటన ఒకటి విడుదల అవుతుంది. దీనికి అనుగుణంగానే సభాపతి కోడెల శివప్రసాదరావు రాజధాని ప్రాంతంలో సుడిగాలి పర్యటనలు షురూ చేస్తారు.
ఆపై ఏదో ఒక సాకు చెప్పి తూచ్.. అనడం ఇప్పటికే రెండు సార్లు జరిగిపోయింది. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఇదే తంతు కొనసాగుతోంది. ఒకసారి ఏఎన్‌యూ.. రెండోసారి తుళ్లూరు అన్న స్పీకర్.. ఇప్పుడు కేఎన్‌యూ అనువుగా ఉందని చెబుతున్నారు. ఈ తంతును గమనిస్తున్న విద్యావంతులు భూముల ధరల పెంపు ప్రక్రియలో భాగంగానే ఈ వ్యవహారం ఇలా కొనసాగుతోందని గుసగుసలాడడం కొసమెరుపు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అమరావతి ప్రాంతంలో జరుగుతాయో? లేదో? తెలియదు గానీ.. ప్రతిసారీ ఈ విషయాన్ని పనిగట్టుకుని చేస్తోన్న ప్రచారంలా కనిపిస్తోంది. గతంలో రెండు సార్లు.. అసెంబ్లీ సమావేశాలు నూతన రాజధాని ప్రాంతంలోనే జరుగుతాయంటూ విస్తృతంగా ప్రచారం చేయడం, చివర్లో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. 2014 ద్వితీయార్థంలో అసెంబ్లీ సమావేశాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించాలని ప్రభుత్వం అభిప్రాయపడింది.
అప్పట్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ క్యాంపస్‌లోని డైక్‌మెన్ హాలును పరిశీలించి వెళ్లారు. సమావేశాల నిర్వహణకు అన్ని విధాలా అనువైన ప్రాంతంగా నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం సమావేశాలు జరిగే వారం ముందే నిర్ణయాన్ని మార్చుకుంది.
హైదరాబాద్‌లోనే సమావేశాలు నిర్వహించింది. ఆ తర్వాత 2015 డిసెంబరు 17 నుంచి జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కూడా తుళ్లూరులో నిర్వహించాలని భావించారు. స్పీకర్ కోడెల స్వయంగా తుళ్లూరు ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం అప్పట్లో నిధులను కూడా విడుదల చేసింది.
అయితే ఏర్పాట్లకు సమయం సరిపోదన్న కారణంతో చివర్లో నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విజయవాడకు సమీపంలోని కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. మంగళవారం కళాశాలకు చేరుకున్న స్పీకర్ కోడెల, జిల్లా అధికారులు కేఎల్‌యూ ప్రాంగణంలోని అనువైన భవనాలను పరిశీలించారు.
సమావేశాల నిర్వహణకు అనుకూలమైన భవన సముదాయాలు ఉన్నాయని స్పీకర్ పేర్కొన్నారు. ఈ విధంగా సమావేశాలు జరిగే నెల రోజుల ముందు రాజధాని ప్రాంతంలో పర్యటించడం, సమావేశాలు ఇక్కడేనని ప్రకటనలు చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ప్రజాభిప్రాయం మేరకే రాజధానిలో సమావేశాలు పెట్టాలనుకుంటున్నామని సర్కారు చెబుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ తంతు కొనసాగుతోందని కొందరు విద్యావంతులు గుసగుసలాడుతున్నారు.