
పర్మిట్ల జాతర
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరోసారి కొత్త ఆటోపర్మిట్లపై కసరత్తు మొదలైంది. గతంలో పలు జీవోల కింద విడుదలై గడువు ముగిసిన కారణంగా మిగిలిపోయిన 14 వందలకు పైగా ఆటోపర్మిట్లను తిరిగి విడుదల చేసేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. నిరుపేద నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పర్మిట్లను అందజేయనున్నారు. ఇందుకుగాను పలువురు డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా, కొందరు ప్రొసీడింగ్స్ కూడా తీసుకున్నారు. అయితే పర్మిట్ల విక్రయాలపై 120 రోజుల గడువు ముగియడంతో అధికారులు వాటిని పెండింగ్‌లో ఉంచారు.
తాజాగా పెండింగ్‌లో ఉన్న పర్మిట్లను జారీ చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఆర్టీఏ యంత్రాంగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదట ప్రొసీడింగ్స్ తీసుకున్న సుమారు 250 మందికి పర్మిట్లను అందజేసి మిగతా వాటి కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఇలా వచ్చిన వాటిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ, ఓసీ కేటగిరీల కింద పర్మిట్లను అందజేయనున్నారు.
ఆటోడ్రైవర్లఎదురు చూపులు...
ఉపాధికోసం నగరానికి వలస వచ్చే నిరుద్యోగులకు Sఆటో రిక్షా పెద్ద దిక్కుగా మారుతోంది.దీంతో రోజూ రూ.400 ల చొప్పున అద్దె చెల్లించి ఆటోలు నడుపుకొంటున్నారు. వారిలో కొందరి ఆర్ధిక సామర్ధ్యం ఉన్నా 2002 నుంచి కొత్త పర్మిట్లపైన నిషేధం కొనసాగుతుండటంతో కొనుగోలు అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పర్మిట్లపై ఆంక్షలు సడలించడంతో 2012లో పెద్ద ఎత్తున కొత్త పర్మిట్లకు అనుమతులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రాతిపదికన పర్మిట్లను కేటాయించారు. అయితే తెలంగాణ ఉద్యమం కారణంగా ఈ తతంగం నిలిచిపోయింది. నూత రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం మరోసారి పాతవాటికే తిరిగి కొత్తగా విధివిధానాలను ఖరారు చేస్తూ ఆటోరిక్షాల అమ్మకాలకు అవకాశం కల్పించింది. అయితే 120 రోజుల్లో ఆటో విక్రయాలను పూర్తి చేయాలని ఆదేశించడంతో ఆ గడువు లోగా అమ్మకాలు పూర్తికాకపోవడం, మిగిలిన పర్మిట్లు పెండింగ్ జాబితాలో చేరిపోవడం పరిపాటిగా మారింది. అలా 2014 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ జాబితాలో ఉన్న 1400 కు పైగా ఆటో పర్మిట్లకు రెండు,మూడు రోజుల్లో అనుమతులు విడుదల కానున్నాయి.