‘కూలి’న బతుకులు! | Autorickshaw and lorry rams into each other, 4 died | Sakshi
Sakshi News home page

‘కూలి’న బతుకులు!

Published Sun, Dec 4 2016 7:06 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

‘కూలి’న బతుకులు! - Sakshi

‘కూలి’న బతుకులు!

- ఆటోను ఢీకొన్న ట్రాన్స్‌పోర్టు లారీ 
- ముగ్గురు మహిళా కూలీలు దుర్మరణం
- ఎంపీటీసీ సభ్యురాలితోపాటు
  మరో 12 మందికి గాయాలు
- ఒకరి పరిస్థితి విషమం
 
ఎన్‌. రంగాపురం (ప్యాపిలి):  వారంతా రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు. రోజులాగే ఆదివారం తెల్లవారు జామున ఆటోలో కూలీ పనికి బయలుదేరారు. మృత్యురూపంలో లారీ దూసుకొచ్చి.. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ప్యాపిలి మండలం ఎన్‌. రంగాపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెంగళాంపల్లి గ్రామానికి చెందిన 16 మంది కూలీలు ఉల్లి నాట్లు వేసేందుకు  తెల్లవారుజామునే ఏపీ 21డబ్ల్యూ 8529 నంబర్‌ గల ఆటోలో డోన్‌ మండలం కొచ్చెర్వు గ్రామానికి బయలుదేరారు. ఎన్‌. రంగాపురం గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏపీ 24వై 4902 నంబర్‌ గల లారీ..ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న  బండి పెద్దక్క (65), ఆమె మనుమరాలు జ్యోతి (18), ఖాశీంబీ (38) అక్కడిక్కడే మృతి చెందారు. కూలీ పనికి వెళ్తున్న ఎంపీటీసీ సభ్యురాలు బండి లక్ష్మమ్మ,  బండి శీలమ్మ, రంగమ్మ, శ్రీవాణి, సరళ, లక్ష్మీదేవి,  మద్దిలేటమ్మ, మల్లేశ్వరి, రామాంజనమ్మ, దస్తగిరమ్మ, ఆదిలక్ష్మి, మహేశ్వరిలకు  గాయాలు కావడంతో డోన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో వడ్డె లక్ష్మీదేవి పరిస్థితి విషమంగా ఉంది. 
ఒకే కుటుంబంలో జేజి, మనుమరాలు మృతి
ప్రమాదంలో మృతి చెందిన పెద్దక్క, జ్యోతిలు జేజి మనుమరాలు. గ్రామానికి చెందిన ఆదినారాయణ, మద్దిలేటమ్మల కుమార్తె జ్యోతి. ఆదినారాయణ తల్లి పెద్దక్క. జేజి, మనుమరాలు ఇద్దరూ కలసి ఆటోలో కూలీ పనికి వెళ్తూ  ప్రమాదంలో మృతి చెందటంతో ఆదినారాయణ, మద్దిలేటమ్మల రోదన మిన్నంటింది. 
గతంలో గొర్రెలు..నేడు ఖాశీంబీ
ఖాశీంబీకి చెందిన 20  గొర్రెలు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ కింద పడి మృతి చెందాయి. గొర్రెలు మృతి చెందినప్పుడు యాజమాన్యం నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఇదే ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీనే ఆదివారం.. ఖాశీంబిని పొట్టనపెట్టుకుంది. సంఘటనా స్థలంలో ఖాశీంబీ భర్త మహబూబ్‌బాషా, కుమార్తెలు షమీనా, షబానా, కుమారుడు షబ్బీర్‌ వలి రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. 
శోకసంద్రంలో వెంగళాంపల్లి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంతో పాటు మరో 13 మంది గాయపడిన విషయం తెలియగానే వెంగళాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లెదుటే  పనికి వెళ్లొస్తామని ఆటోలో సంతోషంగా వెళ్లిన పెద్దక్క, జ్యోతి, ఖాశీంబీలు విగతజీవులుగా మారడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. గ్రామానికి చెందిన 13 మంది గాయపడటంతో వారి బంధువులు ఆసుపత్రుల వద్దకు చేరుకున్నారు. ఉపాధి పనులకు పోతే రూ. 20 కూడా కూలి రావడం లేదని.. దీంతో ఉల్లి నాట్లకు వెళ్తున్న గ్రామస్తులు తెలిపారు. ఉల్లినాట్లు వేస్తే రోజుకు రూ. 100 కూలి వస్తుందని వారు తెలిపారు. ఉన్న ఊరులో పని లేక.. పొట్టకూటికి వెళ్తే ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కానిస్టేబుల్‌ కావాలన్న కల నెరవేరకుండానే...
ప్రమాదంలో మృతి చెందిన జ్యోతి కానిస్టేబుల్‌ కావాలని ఎన్నో కలలు కనేది. ఇంట్లో వాళ్లతో పాటు తాను కూడా కూలీ పనికి వెళ్తూనే ఇంటి వద్ద చదువుకుంటోంది. కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో అర్హత సాధించిన జ్యోతి త్వరలో సెలక‌్షన్‌లకు వెళ్లాల్సి ఉంది. సెలక‌్షన్లకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కూలీ పనులకు వెళ్తోంది. కనీసం చార్జీలకైనా డబ్బు సమకూర్చుకోవాలని ఉల్లి నారు నాట్లు వేసేందుకు వెళ్తున్నట్లు జ్యోతి చెప్పేదని గ్రామస్తులు తెలిపారు. కానిస్టేబుల్‌ కావాలన్న కల నెరవేరకుండానే విగతజీవిగా మారిన కూతుర్ని చూసి తల్లిదండ్రులు కుప్పకూలి పోయారు. 
 
 ఘటనా స్థలం వద్ద ప్రజల ఆందోళన..
అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందటంతో వెంగళాంపల్లి, ఎన్‌ రంగాపురం గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మార్గంలో అధిక సంఖ్యలో జరుగుతున్న ప్రమాదాలాన్నీ అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీల వల్లే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అద్యక్షులు వై. నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆగ్రహానికి గురైన ప్రజలు ఓ దశలో అరుణాచల ట్రాన్స్‌పోర్టు డీజీఎం బాలసుబ్రమణ్యంపై దాడికి చేశారు. బాలసుబ్రమణ్యం వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లు విసిరి లారీ అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని గమనించిన డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, సీఐ ప్రసాద్, ఎస్సై తిమ్మయ్యలు పరిస్థితిని అదుపులోకి తెచ్చి డీజీఎంతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు కంపెనీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని డీజీఎం హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement