బాదుడు షురూ..
• కొత్త చార్జీలను అమల్లోకి తెచ్చిన బ్యాంకులు
• కనీస నగదు నిల్వ లేకపోయినా, పరిధి దాటిన నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలపై జరిమానాలు
• జనరల్ ఖాతాదారులపై తీవ్ర భారం
• బ్యాంకుల తీరుపై మండిపడుతున్న ఖాతాదారులు
• చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఖాతాదారులపై చార్జీల బాదుడు ప్రారంభమైంది. ఇదివరకే ఎస్‌బీఐ ప్రతి సేవకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి అమలు కూడా చేసింది. మిగతా బ్యాంకులు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే చార్జీలను అమలు చేస్తున్నాయి. దీంతో విషయం తెలియని ఖాతాదారులు అకౌంట్లలో కనీస నిల్వలు ఉంచక, అలాగే నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలు పరిమితికి మించి చేస్తూ చాలామంది చార్జీల బాదుడికి గురవుతున్నారు. చెక్‌బుక్ కావాలన్నా, నెలలోమూడుసార్లకు మించి నగదు జమచేసినా, సొంత ఏటీఎంలో ఐదుసార్లకు మించి డబ్బులు విత్‌డ్రా చేసినా, అకౌంట్ మూసివేయాలనుకున్నా, పరిమితికి మించి లాకర్లను తెరిచినా.. ఇలా ప్రతి సేవలపై ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల చార్జీల అమలు తీరుపై జిల్లాలో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్జీలను ఎత్తివేసి, పరిమితులను తొలగించాలని కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు 252 బ్రాంచ్‌లున్నాయి. ఆయా బ్రాంచిల్లో సురభి, బేసిక్ సేవింగ్స్, జన్‌ధన్ యోజన ఖాతాలు కాకుండా జనరల్ (వ్యక్తిగతం, సాలరీ, వ్యాపారం, తదితర) ఖాతాలు 20లక్షల వరకు ఉన్నాయి. చార్జీలు జనరల్ ఖాతాలకు మాత్రమే అమలు చేస్తున్నాయి. అయితే ఈ చార్జీల అమలు గతంలో కూడా ఉండేవని, దీనిని మళ్లీ అమలు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. చార్జీలు ఒకే విధంగా కాకుండా వివిధ బ్యాంకులు స్వల్ప తేడాతో అమలు చేస్తున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా చార్జీల అమలుతో బ్యాంకుల్లో ఖాతాదారులు నగదు జమలు చాలావరకు తగ్గించారు.
చార్జీల బాదుడు ఇలా..
• సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడుసార్లు మాత్రమే సొంత బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతి డిపాజిట్‌కు రూ.50 చార్జీ చెల్లించాలి.
• రూ.10,000 నెలవారీ సగటు నిల్వ ఉండే సాధారణ కరెంట్ ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతి రూ.1000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు.
• నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతి లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు.
• లాకర్‌లను సంవత్సరంలో 12 సార్లు మాత్రమే ఉచితంగా తెరవవచ్చు. ఆపై ప్రతిసారి రూ.100 చెల్లించాలి.
• కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం. ఆపై ప్రతి చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది.
• ఖాతా ప్రారంభం ఉచితంగా కాదు. రూ.20 చెల్లించాలి.
• అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఖాతాదారులు తమ ఖాతాల్లో రూ.3000 కనీస నగదు నిల్వ ఉంచాలి, లేదంటే రూ.50పైగా జరిమానా పడుతుంది.
• సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.40 వరకు జరిమానా ఉంటుంది.
• గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో రూ.1000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.30 వరకు జరిమానా తప్పదు.