బీజేపీ మాట నిలబెట్టుకోవాలి
దాచేపల్లి: ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధుల కేటాయింపుపై బీజేపీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ ఎఎస్. రామకృష్ణ అన్నారు. మంగళవారం దాచేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఏపీకి హోదాతో పాటుగా నిధులు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీని సరైన విధానంలో ఆదుకోవటంలేదని ఆయన అన్నారు. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని, లేదంటే తరువాత జరిగే పరిణామాలకు ఆపార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ. 21వేల కోట్లను ఖర్చుపెడుతోందని ఆయన వెల్లడించారు. పీఈటీ, పండిట్ ఉపాధ్యాయులను అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం అమోదం తెలిపారని, సాంఘీక సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు ప్రభుత్వం పెంచిదని ఆయన చెప్పారు.