నష్టాల సాకుతో ‘బస్సుల’ తగ్గింపు
నష్టాల సాకుతో ‘బస్సుల’ తగ్గింపు
Published Sun, Oct 2 2016 10:05 PM | Last Updated on Mon, Aug 20 2018 3:30 PM
* ఖాళీగా వందలాది మంది ఆర్టీసీ సిబ్బంది
* హైర్ బస్సులను మాత్రం తగ్గించని అధికారులు
* కార్మిక సంఘాల ఆందోళన
నష్టాల సాకుతో ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్మికులకు తలపోటుగా మారుతున్నాయి. రీజియన్ నుంచి అనేక ప్రాంతాలకు వెళ్లే సర్వీసులు రద్దు చేయటంతో కార్మికులకు పని లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్టీసీకి చెందిన 83 బస్సులను వివిధ రూట్లలో నిలిపివేశారు. అధికారులు తీసుకున్న నిర్ణయంతో వందలాది మంది కార్మికులు వి«ధులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
గుంటూరు (పట్నంబజారు): రీజియన్ పరిధిలో మొత్తం 1300 బస్సులున్నాయి. వీటిలో 380 (హైర్) అద్దెవి. రీజియన్ వ్యాప్తంగా 13 డిపోల్లో కలిపి 2345 మంది డ్రైవర్లు, 2300 మంది కండక్టర్లు పనిచేస్తున్నారు. కేవలం సంస్థకు చెందిన బస్సుల రూటు నిలిపివేయటంతో కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 83 సర్వీసులను రద్దు చేశారు. దీంతో సుమారు 300 మంది డ్రైవర్లు, కండక్టర్‌లకు పనులు లేకుండా పోయాయని చెబుతున్నారు. గుంటూరు నుంచి బెంగళూరు, విజయవాడ, మాచర్ల, వినుకొండ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులు రద్దు చేశారు. డిపో 1లో 8, డిపో 2 పరిధిలో 8, తెనాలి పరిధిలో 8, పొన్నూరు 7, మంగళగిరిలో 5, సత్తెనపల్లిలో 7, మాచర్ల 6, వినుకొండలో 8, పిడుగురాళ్లలో 6, రేపల్లెలో 5, బాపట్ల డిపోల 5, నర్సరావుపేటలో 5, చిలకలూరిపేటలో 5 బస్సులను నిలిపివేసినట్లు సమాచారం. నష్టాల కారణంగా తాత్కాలిక కుదింపు అని చెబుతున్నప్పటీకీ అందులో వాస్తవం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులను తగ్గించే పనిలో ఉన్నారనే వాదనలు వినవస్తున్నాయి. బస్సుల కుదింపులో ఖాళీగా ఉన్న సిబ్బందిన ఇతర సంస్థ అవసరాలకు కోసం వినియోగిస్తామని అధికారులు చెబుతున్నా... అవి కార్యరూపం దాల్చటంలేదని కార్మికులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హైర్ బస్సులను నిలిపి వేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.
కండక్టర్ వ్యవస్థ రద్దుకే..?
ఏపీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ వ్యవస్థ లేకుండా సర్వీసులు తిప్పాలనే యోచన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆ నిర్ణయాన్ని కార్యరూపం దాల్చే దిశగా ఆర్టీసీ అధికారులు అడుగులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు వెలుగు బస్సులను కొన్నింటిని రద్దు చేసి, నాన్‌స్టాప్, సూపర్‌ఫాస్ట్‌లుగా తిప్పుతున్నారనేది కార్మిక సంఘాల నేతల వాదన. బస్సులను యథాతథంగా తిప్పాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు.
తాత్కాలిక నిలుపుదల మాత్రమే..
రీజయన్ పరిధిలో 83 బస్సులను తాత్కాలికంగా మాత్రమే రద్దు చేశాం. కృష్ణా పుష్కరాల తర్వాత తీవ్రంగా నష్టం వాటిల్లుతున్న రూట్లులో మాత్రమే నిలుపుదల చేశాం. బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అసిస్టెంట్ కంట్రోలర్, ట్రాఫిక్, గ్యారేజీల్లో విధుల్లోకి పంపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న నిర్ణయం ఇదీ. గ్రామీణ ప్రాంతాలు, సింగిల్ రూట్లులో ఏ ఒక్క సర్వీసును రద్దు చేయలేదు.
- ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
Advertisement
Advertisement