కేబుల్ ఆపరేటర్లను అనుమానిస్తున్నారు
సెటాప్ బాక్సుల ధరలు ఒకేలా ఉండాలి
కేబుల్ టీవీ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు
పి.గన్నవరం : ఒకొక్క కంపెనీ సెటాప్ బాక్సు ఒక్కో రకంగా ఉండడం వల్ల, కేబుల్ ఆపరేటర్లను వినియోగదారులు అనుమానిస్తున్నారని కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై ఈ నెలాఖరులో విజయవాడలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో పి.గన్నవరం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్ల సమావేశం జరిగింది. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడు ఉలిశెట్టి బాబీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి వెంకట్రావు మాట్లాడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలు విక్రయిస్తున్న సెటాప్ బాక్సుల ధరలన్నీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి, భద్రత కల్పించాలని, రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్లతో పే చానల్స్ నిర్వాహకులు అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడాలని సమావేశం డిమాండ్ చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని తీర్మానించింది. సమావేశంలో సంఘ నాయకులు ఎస్.సూర్యనారాయణ, ఇడుపుగంటి రామ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.