కార్డు లావాదేవీల పెంపు
- అన్ని వ్యాపార సంస్థల్లోనూ పీఓఎస్ యంత్రాలు
- కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అర్బన్ : వ్యాపార లావాదేవీల్లో నగదుకు బదులుగా డెబిట్(ఏటీఎం) కార్డు వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లోనూ పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డెబిట్ కార్డు వినియోగంపై అదనపు ఛార్జీలు ఉండవన్న ఆయన పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తున్నామన్నారు. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకూ డెబిట్ కార్డు వినియోగించేలా ప్రజలను చైతన్యం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో గురువారం ఆయన జేసీ బి.లక్ష్మికాంతం, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ మురళీకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో రూ.90 కోట్లు నగదు మార్పిడి జరిగిందని, రూ.430 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారని, రూ.1,360 కోట్లు డిపాజిట్ చేశారని తెలిపారు. జిల్లాలో అన్ని బ్యాంకులకు సంబంధించి 556 ఏటీఎంలు ఉంటే ఇప్పటివరకు 300 ఏటీఎంలను వినియోగంలోకి తెచ్చామన్నారు. రెండు మూడు రోజుల్లో అన్నీ పని చేస్తాయని చెప్పారు. 5.73 లక్షల జన్‌ధన్ ఖాతాలున్నాయని, వారిలో డెబిట్ కార్డులు లేని వాళ్లందరికీ బ్యాంకర్లు మూడురోజుల్లో ఇస్తారని చెప్పారు.
డెబిట్ కార్డుల వల్ల చాలా వెసులుబాటు ఉంటుందని, పైగా భవిష్యత్తులో నోట్లు రద్దయినా ఎలాంటి ఇబ్బందీ తలెత్తదనీ అన్నారు. అందువల్ల ప్రజలంతా డెబిట్ కార్డుల ద్వారానే వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. అంతకు ముందు అన్ని వ్యాపార వర్గాల సంఘాల ప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ పీఓఎస్ యంత్రాల వినియోగం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ప్రతి లావాదేవీ డెబిట్ కార్డు ద్వారా సాగితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, ఈ చర్యలకు వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు.