శంకరపట్నం: మహిళల మెడలోంచి బంగారు ఆభరణాలు లాక్కుని.. బైక్‌పై పరారవుతున్న ఇద్దరు దుండగుల్లో ఒకరు కరీంనగర్ జిల్లాలో అడ్డంగా దొరికిపోయాడు. దుండగులను బస్సును ఢీకొనడంతో గాయపడిన వారు తప్పించుకునేందుకు గుట్టపైకి పరుగులు తీశారు. సినీ ఫక్కీలో పోలీసులు, యువకులు ఛేజ్ చేసి ఓ దొంగను పట్టుకున్నారు.
వివరాలివీ...కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన వరలక్ష్మి ఇంటి వద్దే గేదెలకు పశుగ్రాసం వేస్తోంది. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డకు చెందిన ఎండీ.ఫయూజ్, ఎండీ.మన్నన్ అనే యువకులు పల్సర్ వాహనంపై వచ్చి సర్పంచ్ ఇల్లు ఎక్కడ అని అడిగారు. ఆమె చెబుతుండగానే.. ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. అక్కడినుంచి కేశవపట్నంలోని ఓ కిరాణ దుకాణం ముందు ఉన్న అల్లెంకి సుబ్రమణి మెడలోంచి గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యారు. అక్కడి నుంచి కేశవపట్నంకు చెందిన మ్యాకమల్ల సాగరిక తన పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇచ్చి వస్తుండగా పోలీస్‌స్టేషన్ సమీపంలోనే పుస్తెలతాడు లాక్కుని పరారయ్యారు.
సాగరిక వెంటనే పోలీసులకు విషయం చెప్పడంతో ఏఎస్సై ఎంఎస్.బేగ్ తన సిబ్బందితో కలిసి దొంగలను వెంబడించారు. కొత్తగట్టు శివారుకు చేరుకోగానే వేగం పెంచడంతో అదుపుతప్పిన దొంగలు ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ సంఘటనలో ఫయాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతోనే లేచి కొత్తగట్టులోని పెద్దగుట్టపైకి చేరుకున్నారు. స్థానిక యువకులు, పోలీసులు కలిసి గుట్టపైకి చేరి గాలింపు చేపట్టారు. రక్తపు మరకల ఆధారంగా వెదకగా.. ఫయాజ్ ఓ సొరంగంలో దాక్కున్నాడు. అతడిని పట్టుకొని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో దొంగ మన్నన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.