కంట్లో 'కారం'
కంట్లో 'కారం'
Published Sat, Nov 5 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
* గుంటూరులో యథేచ్ఛగా కల్తీ కారం తయారీ
* వ్యర్థాలకు రంగులద్ది.. ఆపై జనం నెత్తిన రుద్ది..
* తయారీలో ప్రమాదకర రసాయనాల వినియోగం
* కోట్లల్లో వ్యాపారం.. ప్రమాదంలో ప్రజారోగ్యం
* నియంత్రణ చర్యలు నామమాత్రం
తోపుడుబళ్లు.. టిఫెన్ సెంటర్లలో తయారుచేసే ఆహార పదార్థాలు ఎర్రగా వర్రగా కనిపిస్తూ నోట్లో నీళ్లూరింపజేస్తాయి. వ్యాపారులు ఎదురుగా ప్రదర్శించే చికెన్ లేదా గోబీ మంచూరియాలకు రంగుల మసాలాలద్ది ఇట్టే ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చితే ఇక్కడ రేట్లు కూడా తక్కువే. మరి ఇలాంటి కల్తీ కారాన్ని ఎలా తయారుచేస్తున్నారో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే.
సాక్షి, అమరావతి బ్యూరో : ‘కాదేదీ కల్తీకనర్హం..’ అన్నట్లుంది జిల్లాలో పరి స్థితి. ప్రతి వస్తువులోను కల్తీ చేసి వ్యాపారులు అందినకాడికి దోచుకుం టున్నారు. నియంత్రించాల్సిన కొం దరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో వీటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిత్యావసరాలు నూనె, నెయ్యి, కందిపప్పు, కారం ప్రతిదానిలో కల్తీ చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గుంటూరులో 100కు పైగా కారం మిల్లులు ఉన్నాయి. సగటున ఏడాదికి 40 వేల టన్నులకు పైగా కారంపొడిని తయారుచేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపుతారు. ఇందులో కొంతమంది కల్తీ కారం తయారుచేసి జనాలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం మిల్లులు, కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడుల నేపథ్యంలో కల్తీ కారం గురించి ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కల్తీకి శ్రీకారం చుడుతున్నారిలా..
కల్తీ కారాన్ని ప్రధానంగా రెండు పద్ధతుల్లో చేస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా కంభం, మేదరమెట్లలో చైనా సాంకేతిక పరిజ్ఞానంతో మిరపకాయల నుంచి నేచురల్ ఎరుపు కలర్, ఆయిల్ తయారుచేస్తారు. ఈ నేచులర్ కలర్ ఫారిన్‌లో ఉపయోగిస్తారు. ఆయిల్‌ను టాబ్లెట్‌లపై ఉండే నున్నటి చిన్న పొరకు వినియోగిస్తారు. దీనిని తయారుచేసేటప్పుడు పెద్దఎత్తున వ్యర్థం వస్తుంది. ఇది రంపపు పొట్టు మాదిరి ఉంటుంది. దీనిని ఇక్కడి వ్యాపారులు చైనా కారం అని వాడుక భాషలో పిలుస్తారు. దీనికి కారానికి సంబంధించిన గుణాలు ఉండవు. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాన్ని దూరంగా తీసుకెళ్లి పారవేయాలి లేదా పాతిపెట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. పవర్ ప్లాంట్‌లో దీనిని ఉపయోగిస్తారు. దీంతో ఫ్యాక్టరీ యజమాన్యమే దీనిని బయట వేసేందుకు కిలోకు రెండు రూపాయల చొప్పున కాంట్రాక్టర్‌కు ఇస్తోంది. ఈ వ్యర్థాన్ని గుంటూరుకు చెందిన కొంతమంది కారం మిల్లుల యజమానులు కిలో రూ. 10–16 లకు కొనుగోలు చేసి కల్తీ కారం తయారు చేస్తున్నట్లు తెలిసింది. మిరపకాయలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు కెమికల్స్ కలుపుతారు. అందువల్ల ఈ పొడిలో వ్యర్థాలు ఇమిడిపోతాయి. దీనివల్ల కిడ్నీ, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
తయారీ ఇలా...
ఫ్యాక్టరీల నుంచి వచ్చిన పొట్టు (బూడిద) 85 శాతం, 10 శాతం కారం, 5 శాతం రెడ్‌ఆక్సైడ్ మిక్స్ చేసి కల్తీ కారం తయారు చేస్తారు. ఇంకో పద్ధతిలో మిరపకాయల కాడలు, తాలు కాయలను తీసుకుని పొడి చేస్తారు. ఇది కొద్దిగా మిర్చి వాసన వస్తుంది. దీనికి కొంచెం మంచి కారం, రెడ్ ఆక్సైడ్, సూడాన్‌ను కలిపి కారం తయారు చేస్తారు. మిరప తొడిమల్లో సైతం ఆఫ్లటెగ్జాన్ ఉండడంతో లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి.
మంచి కారం అంటే...
క్యాపిన్ గాఢత 900 ఎస్‌హెచ్‌యూ, కలర్ వాల్యూ 70 యూనిట్లు ఆస్టా, ఆప్లటెగ్జిన్ 10 పీబీ నుంచి 30 పీబీ వరకు ఉండాలి. బూడిద (వ్యర్థం) 7 శాతం, తేమ 11 శాతం ఉండాలి. ఈ నకిలీ కారంలో క్యాపిన్ గాఢత, కలర్ వాల్యూ వంటివి ఏవీ ఉండనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బూడిద మాత్రం 90 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం.
సరఫరా చేస్తున్నారిలా...
తక్కువ ధర పేరుతో హోటళ్లు, తోపుడు బళ్లు, హాస్టళ్లకు ఈ కారం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో తోపుడుబళ్లపై దీనిని అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని రకాల బ్రాండ్ల పేరుతో కారం పొడి తయారుచేసి ఈ కల్తీ కారం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement