క్లీనర్ నడపడంవల్లే...
- ప్రమాదసమయంలో తాను లారీలో లేనంటున్న డ్రైవర్
- అయినా యజమాని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు
- లారీ యజమాని టీడీపీ నేతకు స్వయానా సోదరుడు
పెనుకొండ: పెనుకొండ రైలుప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ బాషా తప్పించుకున్నారని, నిద్రపోతున్న క్లీనర్ నాగరాజు చనిపోయారని పోలీసులు సోమవారం ఉదయం తెలిపారు. కానీ రాత్రికి కొత్త కోణం వెలుగు చూసింది. ప్రమాద ఘటనలో తాను లేనని, అయినా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని డ్రైవర్ బాషా వెల్లడించారు. ఆయన అడ్వకేట్ సహాయంతో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) ముందు లొంగిపోయేందుకు వచ్చారు. అయితే కే సు తమ పరిధిలోకి రాదని డీఎల్‌ఎస్‌ఏ చెప్పడంతో తిరిగి రైల్వే ఎస్పీని కలిసేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా బాషా కోర్టు ఆవరణలో మీడియా సిబ్బందికి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. కాఫీ తాగేందుకు లారీని ఓ చోట ఆపామని, అప్పుడు క్లీనర్ నాగరాజు లారీని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని చెప్పారు. తాను వెనకే వస్తున్న మరో లారీ ఎక్కి 20 నిమిషాల తర్వాత బయలుదేరానని తెలిపారు. తాము రైల్వేక్రాసింగ్ వద్దకు వచ్చేసరికి ప్రమాదం జరిగిందని, వెంటనే ఈ విషయాన్ని లారీ యజమాని వెంకటసుబ్బయ్యకు ఫోన్‌చేసి చెప్పామని తెలిపారు. అక్కడి నుండి వచ్చేయాలని యజమాని సూచించారని చెప్పారు. ప్రమాదానికి గురైన లారీని డ్రైవ్ చేస్తున్న నాగరాజుకు లెసైన్సు లేకపోవడంతో, డ్రైవ్ చేసినట్లు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. అయితే బాషా మాటలను రైల్వే డీఎస్పీ మధు కొట్టిపడేశారు. ‘‘లారీలో ఖచ్చితంగా డ్రైవర్ బాషా ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన క్లీనర్ నాగరాజుపైకి నెడితే అతను చనిపోయాడు కాబట్టి కేసు ఉండదు. అందువల్లే తాను లేనని బాషా చెబుతున్నారు. వాస్తవంగా అతనే డ్రైవింగ్ చేశారు’’అని ‘సాక్షి’తో చెప్పారు. అయితే వేగంగా వస్తున్న లారీలో నుంచి దూకితే డ్రైవర్ బాషాకు దెబ్బలు తగలాలి. అతను మామూలుగా ఉండటం గమనార్హం.
మరోవైపు ప్రమాదానికి గురైన లారీ, బాషా ప్రయాణించిన మరోలారీ రెండూ తాడిపత్రికి చెందిన అతికారి వెంకటసుబ్బయ్యకు చెందినవే. ఆయన వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం టీడీపీ నేత అతికారి వెంకటయ్య (ఇతని భార్య జెడ్పీటీసీ సభ్యురాలు)కు స్వయాన సోదరుడు. ప్రమాదానికి గురైన లారీ టాటా 2003 మోడల్ అనీ, ట్యాక్స్, ఎఫ్‌సీ, ఐసీ, పర్మిట్లు సక్రమంగానే ఉన్నాయని డీటీసీ సుందర్ వెల్లడించారు. ఈ లారీలో 17టన్నుల బరువు రవాణా చేసేందుకు అనుమతి ఉండగా... గ్రానైట్ రాయి బరువు 25టన్నులదాకా ఉంటుందని గ్రానైట్ వ్యాపారులు చెబుతున్నారు. అధిక బరువు లోడ్ చేసినందుకూ, లెసైన్స్ లేని వ్యక్తిని డ్రైవరుగా పెట్టుకున్నందుకు లారీ యజమానిపై కేసు నమోదుచేయాల్సి ఉంది. అయితే లారీ యజమాని టీడీపీ నేత అయినందువల్ల డ్రైవర్ బాషాపై కేసు నమోదుచేసి, లారీ యజమానిని కేసునుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
భయానక దృశ్యం చూడలేకపోయాం
పెనుకొండ: బెంగళూరు నుంచి రాయచూరు వెళుతున్నా. 2-20 గంటల ప్రాంతంలో మా ముందు బోగీలో పెద్దశబ్దం వినిపించింది. తేరుకునేలోపే రైలు అటుఇటు కుదుపులకు గురయి నిలచిపోయింది. దిగి చూస్తే పక్క బోగీ ధ్వంసమైన దృశ్యం కనిపించింది. భయానకం దృశ్యం చూడలేకపోయా.
- మౌనేష్‌నాయక్, దేవదుర్గ
లారీ వేగంతో వచ్చి రైలును ఢీకొంది
బెంగళూరు నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 2.20 గంటల ప్రాంతంలో వస్తోండగా గేటు వేసి పచ్చజెండా చేతిలో పట్టుకుని రూం ముందే నిల్చోని ఉన్నాను. ఆ సమయంలో మడకశిర నుంచి లారీ వేగంగా రావడం చూసి గట్టిగా కేకలు వేశా. అంతలోనే రైలు వేగంగా రావడం, లారీ గేటును, రైలును ఢీకొనడం క్షణాల్లో జరిగిపోయాయి.
- తిమ్మయ్య, రైల్వే గేట్‌మెన్, షీఫారం
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాం
రైలులో పెద్ద శబ్దం వచ్చి ఆగిపోయింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశాం. పోలీసులు రైలు వద్దకు వచ్చాక ప్రమాదం గురించి తెలుసుకున్నాను.
- గంగప్ప, దేవదుర్గ