సమన్వయంతో పథకాల అమలు
-
కలెక్టర్ ముత్యాలరాజు
నెల్లూరు (పొగతోట) : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఇతర కార్యక్రమాలు పూర్తిస్థాయిలో విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వివిధ పథకాలు రెండు..మూడు శాఖల అధ్వర్యంలో నిర్వహించాల్సి వస్తుందన్నారు. నిర్దేశించిన పథకాల లక్ష్యాలను సాధించడానికి జిల్లా అధికారులందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. ఇంటర్నెట్, వాట్సప్ వంటి సమాచార సాధనాలతో
క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవచ్చున్నారు. దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ దానికి అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులకు సకాలంలో బ్యాంక్‌ల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన అలోచనలతో వేగవంతంగా చర్యలు తీసుకుంటే లక్ష్యాలను వంద శాతం సాధించవచ్చునని తెలిపారు. ప్రాధమిక రంగాల విషయంలో నిర్ణయించిన సమయానికి సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశాల్లో లక్ష్య సాధనలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హుల దరి చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మహమ్మద్‌ఇంతియాజ్ మాట్లాడుతు భూ సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ–ఆఫీస్ ద్వారా రికార్డులు పంపించాలని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ–2 రాజ్‌కుమార్, ఈఆర్వో మార్కండేయులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.