♦ కుర్చీ కోసం పోటాపోటీగా పైరవీలు
♦ ఖద్దరు నేతలను ఆశ్రయిస్తున్న ఖాకీలు
♦ పై అధికారులను సైతం కదిలించే యత్నంలో ఓ సీఐ
♦ అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తున్నారనే కారణం
సాక్షి ప్రతినిధి, కడప: పోస్టింగ్‌ల కోసం కొందరు, అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తున్నారని మరికొందరు పైరవీలకు తెరలేపారు. లక్ష్యసాధనలో అలక్ష్యం ప్రదర్శిస్తూ ఖద్దరు నేతలను ఆశ్రయిస్తున్నారు. కులం, తూకం, విధేయుతను బేరీజు వేసుకొని అధికార పక్షం సైతం పైరవీలకు ప్రాధాన్యత ఇస్తోంది. నిజాయితీ నిబద్ధతకు కాలం చెల్లిన తరుణంలో అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో కోల్ద్‌వార్ నడుస్తోంది. కడప, రాజంపేట, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ల పరిధిలో ఆ పరిస్థితి మరింత అధికంగా ఉన్నట్లు సమాచారం.‘రక్తాన్నైనా చిందిస్తాం.. ప్రజల మాన, ప్రాణాలను రక్షిస్తాం’ అనే స్ఫూర్తి ఎక్కువ మంది పోలీసు అధికారుల్లో లోపించింది.
అక్రమార్కులైనా ఆదాయం ఉంటే చెలిమికి ఓకే అని కొందరు, అధికార పార్టీ చల్లని చూపు ఉంటే చాలు అని ఇంకొందరు వ్యవహరిస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్ పోస్టింగ్ కోసం యాచిస్తున్నారు. ఆ మేరకే ఖాకీ చొక్కాలు ఖద్దరు నేతల పంచన చేరుతున్నారనే విమర్శలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ ఆదాయానికి అడ్డుగా నిలుస్తున్న పై అధికారులను సైతం సాగనంపేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. కొందరు ట్రిపుల్ స్టార్ అధికారులు ఈ దిశగా పావులు కదుపుతోన్నట్లు సమాచారం.
డీఎస్‌పీని సాగనంపేందుకు యత్నం..
కడప, రాజంపేట, ప్రొద్దుటూరు సబ్ డివిజన్ల పరిధిలో పలు సర్కిల్ కార్యాలయాలకు యమగిరాకీ ఏర్పడింది. కడపలో పని చేసిన ఓ అధికారి తిరిగి కడపలోనే ఏదో సర్కిల్‌లో పోస్టింగ్ కోసం విశ్వయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరో ట్రిపుల్ స్టార్ అధికారి తన పై అధికారి అడ్డుగా నిలుస్తున్నారని బదిలీ చేయించేందుకు హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందుకు ఏకైక కారణం ఆయన అక్రమార్జనకు అడ్డుగా నిలుస్తుండడమేనని తెలుస్తోంది. కాగా తమ పోస్టుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని పోస్టింగ్స్‌లో ఉన్న కొందరు అధికారులు సైతం రాజకీయ గాడ్‌ఫాదర్‌లను ఆశ్రయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల మెప్పుకంటే రాజకీయ నేతల మెప్పు కోసమే తాపత్రయ పడుతున్నట్లు సమాచారం. ఆ మేరకే ప్రొద్దుటూరు, రాజంపేట, కడప సబ్ డివిజన్ల పరిధిలో పోటీ అధికమైనట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు సైతం కులం, వర్గం, తూకం, విధేయుతపై అంచనాకు వచ్చాకే పోస్టింగ్స్ కోసం ప్రతిష్టకు పోతున్నట్లు సమాచారం.
అసాంఘిక శక్తులకు చేయూత!
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో ఈ వ్యవహారం అధికంగా ఉంది. తెరవెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, ట్రిపుల్ స్టార్‌ల ఐడీ పార్టీలు ఉన్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు అధికారులు స్వయంగా నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అధిక వడ్డీలకు పోలీసు అధికారులే డబ్బు అందిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అప్పుదారుల నుంచి పూచీకత్తుగా ఆస్తులు వశపర్చుకుంటున్నట్లు సమాచారం. ఆదాయమే లక్ష్యంగా పని చేస్తున్న కొంత మంది కారణంగా మొత్తం వ్యవస్థకు మాయని మచ్చ ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు సమాచారం.