మైనర్ ఇరిగేషన్ శాఖలో 19 మందికి పోస్టింగ్ బాధ్యతల స్వీకరణ
మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు దోహదం
వరంగల్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఎంపికైన 124 మంది ఇంజినీర్లకు మైనర్ ఇరిగేషన్(చిన్న నీటిపారుదల) శాఖలో పోస్టింగ్‌లు ఇచ్చారు. కాగా, వీరిలో 19 మందిని జిల్లాకు కేటాయించారు. పోస్టింగ్ పొందిన వారంతా సోమవారం హన్మకొండలోని సర్కిల్ కార్యాలయంలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మైనర్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో ఇంజినీరింగ్ కేడర్‌లో 77 మంది ఉండాలి. 58 పోస్టుల్లో ఏఈలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 19 పోస్టుల్లో ఇప్పటిదాకా పదవీ విరమణ పొందిన అసిస్టెంట్ ఇంజినీర్ల సేవలను టెక్నికల్ కన్సల్టెంట్ల పేరిట ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వినియోగించుకునేవారు. తాజాగా 19 మంది ఇంజినీర్ల నియూమకంతో ఇంజినీరింగ్ కేడర్‌లో పూర్తిస్థారుు భర్తీలు జరిగినట్లవుతుంది. మిషన్ కాకతీయ పనుల దృష్ట్యా ఇప్పటిదాకా ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న టెక్నికల్ కన్సల్టెంట్ల సేవలనూ వినియోగించుకోనున్నారు.
పోస్టింగ్ లేక ఖాళీగా.. ఎస్‌ఆర్‌ఎస్‌పీ డీఈఈలు
మిషన్ కాకతీయ తొలి విడత పనుల సందర్భంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన డీఈఈలు పోస్టింగ్ లేక ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రాజెక్టు నుంచి వచ్చిన 24 మంది ఏఈఈలకు మాత్రం మండలాల్లో పోస్టింగ్ ఇచ్చారు. డీఈఈ పోస్టులు ఖాళీగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. రెగ్యులర్ డీఈఈల బదిలీ, పదవీ విరమణ జరిగితే తప్ప డిప్యూటేషన్‌పై వచ్చే వారికి పోస్టింగ్‌లు రావని పేర్కొంటున్నారు.
వందలాది చెరువుల మరమ్మతుకు..
మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఒకేసారి వందలాది చెరువుల మరమ్మతులు చేపట్టడంతో పనుల పర్యవేక్షణకు తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో లేరు. ఒక్కో మండలంలో 15 నుంచి 30 చెరువులు మంజూరవడంతో ఇంజినీర్ల పర్యవేక్షణ లేక పనులు కుంటుపడుతున్నారుు. దీంతో మిషన్ కాకతీయ తొలివిడత పనుల సందర్భంగా గతేడాది ఎస్సారెస్పీ-1 నుంచి 27 మంది ఇంజినీర్లను మైనర్ ఇరిగేషన్ శాఖకు డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. వీరికి సహాయకులుగా ఉండేందుకు గృహ నిర్మాణ శాఖకు చెందిన 42 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను మైనర్ ఇరిగేషన్ విభాగానికి డిప్యూటేషన్‌పై కలెక్టర్ కేటాయించారు. మిషన్ కాకతీయ రెండో విడతలో టెండర్ల నిర్వహణలో జాప్యం జరగడంతో పనులు వేగవంతం చేసేందుకు 14 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించారు. అంతేకాకుండా మండలాల్లోని ఏఈలకు మూడు నెలల పాటు వాహన సౌకర్యం కల్పించారు. మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసేందుకే ఈ చర్యలు చేపట్టారు.