ఖాకీల్లో ‘కుల'కలం | Excise officers, assault, for inspections | Sakshi
Sakshi News home page

ఖాకీల్లో ‘కుల'కలం

Published Fri, Nov 28 2014 4:06 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఖాకీల్లో ‘కుల'కలం - Sakshi

ఖాకీల్లో ‘కుల'కలం

నిజాయతీ, క్రమశిక్షణ, కార్యదక్షత కలబోస్తే పోలీస్. అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు, పోస్టింగులు అన్నింటికీ ఇవే ప్రామాణికం. కానీ కొత్తగా ఈ అంశాల పక్కనే కులం వచ్చి చేరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌ల్లో నేతల ప్రమేయం పెరిగిపోవడం, తాజాగా అయా నియోజకవర్గాల పోస్టింగ్‌ల విషయం ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడంతో ఇది పలు మలుపు తిరిగి సామాజిక వర్గాల పోస్టింగ్‌లుగా మారుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజాయితీకి పెద్ద పీట వేయాల్సిన నేతలు, ప్రజాప్రతినిధులు వచ్చే అధికారి మన కులమా.. కాదా అని చూస్తుండడం, వారిపై ఎన్ని ఆరోపణలున్నా కులం ప్రతిపాదికన సిఫారసులు చేయడం వారికే చెల్లుతోంది.
 
 జిల్లాలో తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీ నుంచి మొదలు పెడితే త్వరలో జరగనున్న ఎస్సైల బదిలీల వరకు ఎమ్మెల్యేలు వారి సామాజిక వర్గాల వారికే పెద్దపీట వేశారని తెలిసింది. అధికారుల పనితీరును పక్కన పెట్టి ఆయన మనవాడా.. కాదా అని చూస్తున్నారని, కులం కార్డుతోనే పోస్టింగ్‌ల కోసం ప్రతిపాదనలు చేస్తున్నారని ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు అధికారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో వారి సామాజిక వర్గానికి తప్ప మరో వర్గానికి చెందిన అధికారిని సిఫారసు చేయలేదని తెలిసింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వారి సామాజిక వర్గాలకు చెందిన వారిని డీఎస్పీలుగా నియమించుకున్నారు. రెండు వారాల క్రితం ఓ ఎస్సై ఓ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి తనకు ఆయన నియోజకవర్గంలో పోస్టింగ్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. దానికి ఆ ఎమ్మెల్యే ఎస్సైకి సంబంధం లేకుండా జరిగిన విషయంతో పాటు సామాజికవర్గం కనుక్కుని మరోచోట ప్రయత్నం చేయాలని సూచించిన ట్లు తెలిసింది.

సామాజికవర్గం తక్కువ కావడం వల్ల తనకు అక్కడ పోస్టింగ్ దక్కే అవకాశం లేదని సదరు ఎస్సై సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఇలా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు కోరుకున్న చోట పోస్టింగ్‌కు అవకాశం కొట్టేయగా, మరికొందరు ఇబ్బం దులు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 68 పోలీస్ స్టేషన్లున్నాయి. వీటిలో సుమారు వంద మంది ఎస్సైలు పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న శిక్షణ పూర్తి చేసుకున్న 2012 బ్యాచ్‌కు చెందిన 37 మంది ప్రొబేషరీ ఎస్సైలతో పాటు 87 మందిని బదిలీ చేశారు.

వీరిలో శిక్షణ ఎస్సైలు పలువురు కీలమైన పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. గత 11 నెలలుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా పోస్టింగ్‌లు పొందిన పలువురు ఎస్సైలపై పలు ఆరోపణలున్నాయి. 87 మంది పోస్టింగ్‌ల్లో సుమారు ఎనిమిది మంది ఇతర విభాగాలకు బదిలీ చేసుకున్నారు. మరో ఇద్దరు వివిధ కారణాలతో సస్పెండయ్యారు. ఖాళీ అయిన పలు పోలీస్ స్టేషన్లలో వెంటనే ఇన్‌చార్జి ఎస్సైలను నియమించారు.

ప్రస్తుతం ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న వారే పూర్తిస్థాయి ఎస్సైలుగా పోస్టింగ్‌లు పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పలు పట్టణాల్లో, జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఎస్సైల్లో పలువురు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా పోస్టింగ్‌లు తప్పనిసరిగా మారింది.

 నేతల చుట్టూ ప్రదక్షిణలు
 మంచి అధికారులను ఎంపిక చేసుకుని నియోజవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించడంతో ఒక్కసారిగా ఆశావాహులు వారికి అనుకూలంగా ఉన్న నేతల వద్ద వాలిపోయారు.

సామాజిక అంశాలను తెరపైకి తేస్తూ ఉన్నత స్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరు నేతలే తమ దేవుళ్లు అన్నట్టుగా వారి కరుణ కోసం పాడరాని పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా ఎమ్మెల్యే వద్ద క్యూ పెరిగిపోవడంతో ఇదే అదనుగా కొందరు నేతలు బేరసారాలకు దిగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి కోరుకున్న స్థానం దక్కకపోతే మరో రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని, అందువల్ల ఎంతైనా ఖర్చయినా పెట్టేందుకు కొందరు సిద్ధపడినట్లు పోలీస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి.

 వివాదాస్పదమైన బదిలీలు
 వారం రోజుల క్రితం వరంగల్ రీజియన్ పరిధిలో 21 మంది సీఐల బదిలీ జరిగింది. ఈ బదిలీలపై పలు ఆరోపణలు రావడంతో పాటు సదరు సీఐలంటే ఇష్టంలేని కొందరు నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పారు. దీంతో బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఎక్కడివారేక్కడే ఉండాలని మౌఖికంగా అదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన తొలి బదిలీలు వివాదాస్పదంగా నిలిచిపోయాయి. జిల్లాలో గతంలో ఎస్సైల బదిలీలు కూడా చేసినట్టే చేసి నిలిపివేశారు.

ఈసారి అలా కాకుండా ఆయా నియోజకవర్గాల నేతల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే బదిలీ చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. మళ్లీ మళ్లీ ఇబ్బందులు రాకుండా బదిలీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఈసారి జరగనున్న బదిలీలు పక్కా రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఏ ఎస్సై ఏ మండలానికి వెళ్తుతున్నాడో ముందే ప్రచారంలో ఉంది. జిల్లాలో సీఐల పోస్టింగ్‌లు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండడంతో ఈ నెలాఖరు వరకు ఎస్సైలను, సీఐలను పెద్ద ఎత్తున బదిలీలు చేయనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement