కార్పొరేషన్‌లో కోల్డ్ వార్
మేయర్, కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు
తనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటున్న మేయర్
తన పరిధిలో పని చేస్తున్నానంటున్న కమిషనర్ విజయరామ రాజు
స్థాయీ సంఘం అజెండాల ఆమోదంలో మేయర్ ఆలస్యం చేస్తున్నారంటున్న కార్పొరేటర్లు
ఆలస్యమైన పనులేవో చెప్పాలంటున్న మేయర్ పంతం రజనీ శేషసాయి
భిన్నాభిప్రాయాలతో పెరుగుతున్న అంతరం
నగర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం
సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల మౌనంపై నగర ప్రజల విస్మయం
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పాలకవర్గానికి...యంత్రాంగానికి మధ్య అగాధం పెరుగుతోంది. దీంతో నగర అభివృద్ధి, పాలన గాడితప్పే ప్రమాదం ఉందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గోదావరి అంత్య పుష్కరాల అనంతరం మండలికి, యంత్రాంగానికి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. ఈ విషయంలో మేయర్ నాలుగు నెలల క్రితం విలేకర్ల సమావేశం కూడా నిర్వహించి నగరపాలక సంస్థలో జరుగుతున్న పనులేవీ తన దృష్టికి రావడం లేదంటూ వాపోయారు. కౌన్సిల్ ఆమోదానికి రావాల్సిన పనులను కూడా చిన్న చిన్న మొత్తాలుగా విడదీసి స్థాయీ సంఘం ఆమోదానికి పెడుతున్నారని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఈ విషయం సద్దుమణిగినా బేధాభిప్రాయాలు మాత్రం ముదిరిపాకానపడ్డాయి. మేయర్, కమిషనర్లకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందన్న విషయం మంగళవారం మేయర్ పంతం రజనీశేషసాయి విలేకర్ల సమావేశంలో వెల్లడించిన అంశాలతో మరోమారు నిరూపితమైంది. అయితే తన పరిధిలోనే తాను నిర్ణయాలు తీసుకుంటున్నానని కమిషనర్ విజయరామరాజు పేర్కొంటున్నారు. రూ.10 లక్షలలోపు పనులకు తన ఆమోదంతో చేయవచ్చని స్పష్టం చేస్తున్నారు.
కుంటుపడుతున్న నగర అభివృద్ధి...
తనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, స్ధాయీ సంఘం అంజెండాలో తనకు చెప్పకుండానే అంశాలు చేర్చుతున్నారని మేయర్ ఆరోపించారు. గత ఏడాది నవంబర్ 9వ తేదీన స్థాయీ సంఘ సమావేశానికి 17 అంశాలతో కూడిన నోట్‌ఫైల్‌పై మేయర్ సంతకం చేసి పంపారు. అయితే అజెండాలో మాత్రం 25 అంశాలున్నాయి. తనకు చెప్పకుండానే 8 అంశాలు అజెండాలో ఎలా చేరుస్తారంటూ మేయర్ సమావేశాన్ని వాయిదా వేశారు. తరువాత తిరిగి డిసెంబర్ 9న ఆ 25 అంశాలతోపాటు మరో 11 అంశాలు చేరుస్తూ స్థాయీ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రొటోకాల్ పాటించడంలేదని, హ్యాపీ సండే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తనతో చర్చించలేదని ఆరోపించారు. ఇలా అభివృద్ధి పనులు, ఇతర వ్యవహారాల్లో యంత్రాంగం, పాలక మండలికి మధ్య భేదాభిప్రాయల వల్ల నగర అభివృద్ధి కుంటుపడుతోంది. మేయర్ స్థాయీ సంఘం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇతర పనులపై తన ఆమోదం తెలపకుండా నెలల తరబడి నాన్చుతున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
ప్రజా ప్రతినిధుల దృష్టికి వెళ్లినా పరిష్కారమేదీ?
నగర పాలక సంస్థలో పాలన గాడి తప్పిందని పలు సందర్భాల్లో సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యానారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా పేర్కొన్నారు. పాలన గాడిలో పెడతామని ప్రకటనలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా పాలనలో ప్రతిష్టంభన నెలకొనడం ఇదే ప్రథమమని సోమవారం విలేకర్ల సమావేశంలో గోరంట్ల పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాకపోగా ఇంకా పెరిగిపోతోంది. దీని వెనుకు రాజకీయ శక్తులు ఉన్నాయన్న వార్తలు నగరంలో హల్‌చల్ చేస్తున్నాయి. అధికార పార్టీలోనే అనేక గ్రూపులున్నాయన్న చర్చ జోరందుకుంది. నగరపాలక సంస్థలో పైచేయి సాధించేందుకు కొందరు సీనియర్ కార్పొరేటర్లు యత్నిస్తుండడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందన్న ఆరోపణలున్నాయి. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల ఈ విషయం పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ పాలక మండలి ఉన్నచోట ఇలాంటి విభేదాలు తలెత్తడం సహజం. దీనికి భిన్నంగా అధికార పార్టీ టీడీపీయే పాలకవర్గంగా ఉన్నచోట ఇలా జరుగుతుండడంపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.