దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికుల విషయంలో అడ్డగోలుగా అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెకు కార్మికులంతా హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అడపా వెంకటరమణ (గెడ్డం రమణ) ఒక ప్రకటనలో కోరారు. రెండు ప్రభుత్వాలకు కార్పొరేట్ కంపెనీలకు బానిసల్లా పని చేస్తున్నాయని, కార్పొరేట్‌కు అనుకూలంగా చట్టాలు మారుస్తున్నాయని విమర్శించారు.
రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న రోడ్డు భద్రతా చట్టం కార్మికుల పాలిట గుదిబండగా ఉందన్నారు. ఆ చట్టం కనుక అమలైతే రోడ్లపై వాహనాలు నడపలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రానికి తానతందాన అంటూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. కార్మికులకు అస్త్రంగా ఉన్న చట్టాల్లో మార్పులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.