‘నీ పార్టీ పనైపోయింది బాబు’
‘నీ పార్టీ పనైపోయింది బాబు’
Published Mon, Nov 28 2016 10:43 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
ప్రజాగర్జనకు భారీ స్పందన
చింతూరు : రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని అయినా నన్నేం చేయలేరని చంద్రబాబు విర్రవీగుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా ఆయన్ని తరిమి కొడతామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో విలీన మండలాల్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం చింతూరులో ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారా బలపడుతున్నానని చంద్రబాబు భ్రమపడుతునారని, ఆయన వెంట నాయకులే తప్ప ప్రజలంతా వైఎస్సార్ సీపీ, వామపక్షాల వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాలను అణగ దొక్కడం, ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లకు పంపడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని, దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతు తెలిపితే తనను కూడా జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. నోట్ల రద్దుతో దేశమంతా అట్టుడుకుతోందని, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. పోలవరం ముంపు కింద గతంలో ఎకరాకు రూ.లక్షా 15 వేలు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వడం కదురదంటూ స్వయంగా చింతూరులో చంద్రబాబు తేల్చి చెప్పారని, పార్లమెంటు ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టు చేపట్టకపోతే తిరిగి వారికి పరిహారం చెల్లించాలని ఉన్నా ఇవ్వమనడం సబబు కాదన్నారు. పోలవరం ఉద్యమం భవిష్యత్ ప్రణాళికలో భాగంగా డిసెంబరు 5న ముఖ్యమంత్రిని కలసి సమస్యలు వివరిస్తామని, 6న వామపక్ష పార్టీలు, సంఘాలతో కలసి చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, జిల్లా కార్యదర్శి అరుణ్, రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, సుబ్బారావు, జిల్లా నాయకులు ప్రకాష్, రాధ, మురళి, శిరమయ్య, పెంటయ్య, సీతారామయ్య, శేషావతారం, వెంకట్, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజాగర్జనకు విశేష స్పందన
సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో నిర్వహించిన ప్రజాగర్జన సభకు విశేష స్పందన లభించింది. ఈ నెల నాలుగు నుంచి 28 వరకు విలీన మండలాల్లోని 250 గ్రామాల్లో 600 కిలోమీటర్ల మేర నాయకులు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 200 గ్రామాల్లో ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం సరిగా అందడం లేదని నాయకులు తెలిపారు. ప్రజాగర్జన సందర్భంగా చింతూరులో నిర్వహించిన ర్యాలీలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు గిరిజన సాంప్రదాయ రీతిలో కొమ్ము, కోయ నృత్య బృందం తమ నృత్యాలతో స్వాగతం పలికింది. అనంతరం చింతూరులో నిర్వహించిన సభకు నాలుగు మండలాలకు చెందిన ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు వైఎస్సార్సీపీ నాయకులు, సీపీఐ నాయకులు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. నాయకుల ప్రసంగానికి ముందు ప్రజానాట్య కళామండలి సభ్యులు పలు నృత్యాలను ప్రదర్శించారు.
Advertisement