విద్యార్థులు సోదరభావంతో మెలగాలి
– ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు: విద్యార్థులు ఐక్యమత్యంగా ఉండి సోదర భావంతో మెలగాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. కల్లూరు మండలం పెద్దటేకూరు సమీపంలోని బృందావన్ ఇన్సిట్యూట్‌ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) కళాశాలలో బుధవారం ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఎస్పీ ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ కన్నవారి కలలను సాకారం చేయడానికి తపనతో కష్టపడి చదివించే తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చి సమాజానికి ఉత్తమ పౌరులుగా నిలవాలన్నారు. ర్యాగింగ్ చట్టరీత్యా నేరమనే విషయం గుర్తించుకోవాలని హెచ్చరించారు. నిర్ధేశించుకున్న లక్ష్యం సాధించేందుకు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.
తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు శ్రమించాలే కానీ.. ర్యాగింగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతి విద్యార్థి ర్యాగింగ్‌ను పాలద్రోలేందుకు సహకరించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళిక బద్ధంగా సిద్ధం కావాలన్నారు. బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానాలను అందుకోవాలని హితోపదేశం చేశారు. విద్యార్థులు ఎలాంటి తప్పిదాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. యాంటి ర్యాగింగ్ చట్టం కింద శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కళాశాలలో ర్యాగింగ్ సమస్యలు ఉంటే డయల్ 100కు కానీ, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు కాని సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఎస్పీకి సన్మానం చేసి దేవుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్పీ విందు చేశారు. కార్యక్రమంలో బిట్స్ కళాశాల డైరెక్టర్ శివప్రసాదరెడ్డి, ప్రిన్సిపాల్ బాలాజీ, వైఎస్ ప్రిన్సిపాల్ గిరీష్‌రెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.