పంట వర్షార్పణం
- వర్దా తుపాన్‌తో తడిసిన పంటలు
ఉయ్యాలవాడ: గడివేముల: వర్దా తుపాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నష్టం మిగిల్చింది. ఉయ్యాలవాడ, గడివేముల మండలాల్లో రైతులు పంటలు వర్షార్పణం అయ్యాయి. ఆరుగాలం శ్రమించి పండించుకున్న పంట కళ్లముందే తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ రెండు మండలాల్లో ఎక్కువగా వరి, శెనగ, మిరప, మినుము, కంది సాగు చేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్మాహ్నం వరకు చిరు జల్లులతో కూడిన వర్షం పడటంతో రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలోనే అత్యధికంగా ఉయ్యాలవాడ మండలంలో 14,800 హెక్టార్లలో శనగ సాగైంది. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటే వర్షం రావడంతో పూత, కాయ రాలిపోయి పంట నాశనమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వరి, మిరప పంటలు కోసి, దిగుబడులను కళ్లాల్లో ఆరబెడుతున్న సందర్భంలో ఈ వాన కొంప ముంచిందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశారు.