అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట పొలాలు ఎండిపోయాయని దీనికి ప్రభుత్వమే పూర్తి భాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండలంలోని వెల్తుర్లపల్లి శివారులో ఎండిపోయిన వరిపంటలను వారు పరీశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.
రామప్ప సరస్సు పరిధిలోని వీర్లకాలువ, ఒగరుకాలువలకు చెందిన 250ఎకరాల ఆయకట్టు పంటలు ఐబీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎండిపోయాయని ఆరోపించారు. రామప్ప సరస్సులో నీరు ఉన్నప్పటికీ కాలువ లు మట్టితో కూరుకపోవడంతో ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందలేదన్నారు. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల జేబులు నింపేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందనీ.. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న అధికారులు ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై పనులను ఇష్టానుసారంగా చేస్తూ పథక లక్ష్యాన్ని నీరుకారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయలో భాగంగా రామప్ప, లక్నవరం, గణపసముద్రం చెరువులకు సరిపడా నిధులు కేటాయించి అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. రామప్ప సరస్సులోకి దేవాదుల నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి రూ.20వేలు పరిహారం చెల్లించాలని అడిగారు.