పరకాల : కేసీఆర్ ఇంట్లోనే కొడుకు, కూతురు, అల్లుడుతో కలిసి అవినీతి పునాదులు వేస్తున్నారని, మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయగా మార్చి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని దామెర చెరువు, ధర్మారం వద్ద ఉన్న మారేడు చెరువును బుధవారం టీడీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్ కాకతీయకు తాము వ్యతిరేకం కాదని, చెరువుల పూడికతీత పనులలో జరుగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని అన్నారు. బినామీలతో స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్ట్ పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.
దామెర చెరువు పనుల్లోనే రూ.2 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ టెండర్లలో జరిగిన అవినీతిని ప్రజల ముందు పెడితే నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో రెండోస్థానంలో ఉండగా, అవినీతిలో మాత్రం మొదటి స్థానాన్ని ఆక్రమించిందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించిన కోదండరామ్‌ను విషపునాగు అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో నాయకులు తోట రవీందర్, చిట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రాజయ్య, రాజేశ్వర్‌రావు, సాంబరాజు కృష్ణ పాల్గొన్నారు.