ముళ్ల కంచెలతో ‘మొక్కల’కు రక్షణ
-
ఐకేపీ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణ
-
నియోజకవర్గానికి నాలుగు, ఐదు గ్రామాల్లో
-
లక్ష్యాన్ని మించిన మొక్కలు,
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కల రక్షణకు ముళ్ల కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అటవీ, ఈజీఎస్, శాఖల ఆధ్వర్యంలో లక్ష్యాన్ని మించిన మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ల వెంట నాటిన హరితహారం మొక్కలు పశువులు, మేకల బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్‌ఆండ్‌బీ, పంచాయతీరాజ్‌లు రోడ్ల వెంట ఈజీఎస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో లక్షల మొక్కలు నాటించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలు నశించకుండా ప్రభుత్వం ఐకేపీ ఆధ్వర్యంలో ముళ్ల కంచెలను భద్రతగా నాటిస్తున్నారు. జిల్లాలోని 9 నియోజకవర్గాలకు 10 మండలాల్లో కొన్ని గ్రామాలను ఐకేపీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. నిజాంసాగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, గాంధారి, బోధన్, నిజామాబాద్, మాక్లూర్, బీర్కూర్, డిచ్‌పల్లి మండలాల్లోని నాలుగు, ఐదు గ్రామాల్లో మొక్కల సంరక్షణ కోసం ముళ్ల కంచెలను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేస్తున్నారు. నిజాంసాగర్ మండలంలోని నర్వ, బంజపల్లి, వెల్గనూర్, మల్లూర్ గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీరాజ్ రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలకు కంచెలను ఏర్పాటు చేయించారు. ఈజీఎస్ ద్వారా ఆయా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ముళ్ల కంచెలను కూలీల సహాయంతో నాటిస్తున్నారు. గ్రామాల వారిగా హరితహారం కింద నాటిన మొక్కల చుట్టూ నాటుతున్న ఒక్కొ ముళ్ల కంచెకు రూ.130 లు చొప్పున చెల్లించనున్నారు. చెట్ల నాటడంమే కాకుండా చెట్ల సంరక్షణకు నాటిన ముళ్ల కంచెలకు ఈజీఎస్ ద్వారా ఐకేపీ అధికారులు డబ్బులు చెల్లింస్తుండటంతో ముళ్ల కంచెలు నాటడానికి కూలీలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో హరితహారం మొక్కల చుట్టూ ముళ్ల కంచెలు దర్శనమిస్తున్నాయి. మొక్కల చుట్టూ ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడంతో మొక్కలు పూర్తిగా సంరక్షణలో ఉంటాయని అధికారులంటున్నారు.