
పంచాయతీ ఆఫీసు ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్
అధికారులు తమ గ్రామానికి వచ్చి వెళుతున్నారే కానీ సమస్యలను పట్టించుకోవడం లేదని కోర్పోల్ యువకులు మంగళవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో అన్నారు.
- ఇదేమైనా శ్రీమంతుడు సినిమానా..
- ప్రజల సహకారం లేకుంటే అభివృద్ధి అసాధ్యం
- కోర్పోల్‌లో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
- జోరువానలో గల్లీగల్లీ తిరిగిన రోనాల్డ్‌రోస్
పుల్‌కల్: ఎవరెవరో అధికారులు తమ గ్రామానికి వచ్చి వెళుతున్నారే కానీ సమస్యలను పట్టించుకోవడం లేదని, గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టే వరకు ఇక్కడికి వచ్చిన అధికారులను బయటకు వెళ్లకుండా చేస్తామని కోర్పోల్‌లో గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్ రోనాల్డ్ రోస్‌తో అన్నారు.
స్పందించిన కలెక్టర్ ‘‘ఇదేమైనా శ్రీమంతుడు సినిమానా ఒకే రోజు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్‌లు నిర్యించేందుకు’’ అని తనదైన స్టయిల్‌లో అన్నారు. ‘‘అభివృద్ధికి అవసరమైన నిధులు ఇస్తా, మీ స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు గ్రామానికి ఏం చేయగలరు’’ అది చేసి చూపిస్తే అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తా’’నని యువజన సంఘాల నాయకులతో అన్నారు.
ఎప్పటి వరకు శ్రమదానం చేస్తారు.. ఏరోజు చేస్తారో చెప్పండంటూ ప్రశ్నించారు. మండల పరిధిలోని కోర్పోల్‌లో డయేరియాతో ఇద్దరు మహిళలు మృతి చెందడమే కాకుండా, మూడు రోజులుగా 75 మంది అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా గ్రామానికి వచ్చి ఉదయం 9 గంటలనుంచి కాలినడకన గల్లీగల్లీలో తిరుగుతూ సమస్యలను పరిశీలించారు.
గ్రామంలో ఏక్కడ చూసినా మంచినీటి సరఫరా జరిగే పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతో పాటు ప్రతి ఇంటి ముందు నల్లా నీటికోసం తీసిన గుంతలే దర్శనమిచ్చాయి. దీంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండ్ల ముందు పెంటకుప్పలు ఉంటాయా.. ఇలా అయితే రోగాలు రాకుండా ఉంటాయా..అని ప్రశ్నించారు.
నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో మురుగునీరు మళ్లీ నల్లాలోకి వెళుతుంది.. దాని ద్వరానే కలరా..డయేరియా, వంటి రోగాలు వస్తాయన్నారు. అధికంగా ఎస్సీ కాలనీలోనే రోగాలు వచ్చాయని స్థానికులు తెలపగా అక్కడేమైనా విందు చేశారా.. అని ప్రశ్నించారు. ఐదారు రోజుల క్రితం వినాయక మండపం వద్ద అన్నదానం చేశామని కాలనీ వాసులు తెలిపారు.
ట్యాంకులో నిల్వ ఉన్న నీటిని సరఫరా చేయడంతో పూర్తిగా రంగు మారిన నీరు వచ్చిందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఊరంతా చెత్త , పెంట కుప్పలు ఉంటే అలాగే ఉటుందని వారం రోజుల్లో ఇండ్ల మధ్య ఉన్న పెంట కుప్పలను తొలగించకుంటే తామే వాటిని తొలగిస్తామన్నారు. తీసిన గుంతలను స్వచ్ఛందంగా పూడ్చి వేయాలని అదేశించారు.
అందుకు గ్రామంలోని యువజన సంఘాల నాయకులు చొరవ తీసుకొని గుంతలను పూడ్చేందుకు సహకరించాలన్నారు. కొందరు మోటార్లు బిగించడం వల్ల తమకు నీరు రావడం లేదని ఫిర్యాదు చేయగా, మోటార్లు పెట్టే వారిపై రూ. వెయ్యి జరిమానా విధిస్తామంటూ గ్రామ సభలో తీర్మానం చేయాలన్నారు.
నల్లా కనెక‌్షన్ కోసం రూ.500లను గ్రామ పంచాయతీ వారు తీసుకున్నారని చెప్పగా, అది గతంలో చేసిన నిబంధనల ప్రకారం తీసుకున్నామని పంచాయతీ కార్యదర్శి నర్సమ్మ కలెక్టర్‌కు వివరణ ఇచ్చారు. వాటర్ గ్రిడ్‌లో ఉచితంగా నల్లా కనెక‌్షన్ ఇస్తున్నందున తీసుకున్న డబ్బులను వాపస్ చేయాలని ఆదేశించారు.
నిధులు మంజూరు చేయిస్తా
గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్ రోనాల్డ్ రోస్ హమీ ఇచ్చారు. ఈనెల 20 లోగా గ్రామంలోని యువజన సంఘాల నాయకులు శ్రమదానం చేసి ప్రధాన వీధులకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారంతో పాటు నల్లా గుంతలను పూడ్చి వేస్తే అదే రోజు నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
అవసరమైతే తమ సిబ్బంది యువజన సంఘాల నాయకులకు అవసరమైన సహకారం అందిస్తారన్నారు. సర్పంచ్ కలాలి సావిత్రి గ్రామ ప్రజలందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజల సహకారం లేకుండా ఏమీ చేయలేమన్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు తహసీల్దార్ శివరాం పాల్గొన్నారు.