'ఏలూరులో హైకోర్టు.. రాజమండ్రిలో ఎయిమ్స్'
పాలకొల్లు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం రెండు జిల్లాలకే పరిమితమైపోవటం అనేక అనుమానాలకు తావిస్తున్నదని, సీఎం చంద్రబాబు నాయుడి అనునాయుల కోసమే ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో పనులు ప్రారంభిస్తున్నారని సీనియర్ రాజకీయ నాయకుడు హరిరామజోగయ్య ఆరోపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఇంటికి వెళ్లక తప్పదని హెచ్చరించారు. శనివారం పాలకొల్లులో విలేకరులతో మాట్లాడిన చేగొండి పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల ఉభయగోదావరి జిల్లాలక ఎటువంటి ప్రయోజనం లేదన్న ఆయన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఏపీ హైకోర్టును, పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణం రాజమండ్రిలో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని తద్వారా ఆయా జిల్లాల ప్రజను కొంతమేరకు సంతృప్తి పర్చవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తప్పిదాలు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చుట్టుకుంటాయని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే మూల్యం చెల్లించక తప్పదన్నారు. అమరావతిని పరిపాలనా కేంద్రంగా మాత్రమే పరిమితం చేసి మిగిలిన జిల్లాలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ చేపట్టకుంటే ప్రజలను చైతన్యపర్చి ఉద్యమం చేపడతామని హరరామజోగయ్య హెచ్చరించారు.