
'కేసీఆర్ తప్ప ఎవరు సీఎం అయినా...'
కేసీఆర్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పని అయిపోయేదని డీఎస్ వ్యాఖ్యానించారు.
నిజమాబాద్: ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధించలేనిది సీఎం కేసీఆర్ రెండేళ్లలో సాధించారని సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) అన్నారు. కేసీఆర్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పని అయిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు నిజామాబాద్ లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. 2019లోనూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా డీఎస్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు.