ఆగ్రహ జ్వాల
ఆగ్రహ జ్వాల
Published Sun, Aug 28 2016 11:49 PM | Last Updated on Fri, Sep 28 2018 4:30 PM
దివీస్ ల్యాబ్ పనులను అడ్డుకున్న రైతులు
పాక ఏర్పాటుకు వేసిన స్తంభాల తొలగింపు
తుని ఎమ్మెల్యే మద్దతు
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్న దాడిశెట్టి రాజా
రూ.350 కోట్లు మిగుల్చుకునేందుకే ఈ కుట్ర అని వెల్లడి
సెజ్ ఖాళీ భూములకు బదులు రైతుల భూములు ఇవ్వడమేమిటని నిలదీత
తొండంగి :
తొండంగి మండలం కోన తీరప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ పనులను పరిసర గ్రామాల రైతులు అడ్డుకున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యంతో తీరప్రాంత గ్రామాల మనుగడ దెబ్బ తింటుందని పేర్కొంటూ.. పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు తమ భూములివ్వడానికి నిరాకరించారు. ఆ భూముల్లో బలవంతంగా పాకలు వేసేందుకు చేసిన యత్నాలను ఆదివారం అడ్డుకున్నారు. పాక వేసేందుకు ఏర్పాటు చేసిన స్తంభాలను తొలగించారు. ఆగ్రహంతో తాటాకులను దగ్ధం చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి పనులనూ జరగనివ్వబోమని నినదించారు. వారికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పూర్తి మద్దతు తెలిపారు.
అంతకుముందు పంపాదిపేటలో జరిగిన సభలో బాధిత రైతులు, మహిళలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. దివీస్ పరిశ్రమ ప్రతినిధులు తమ భూముల్లో పనులు ప్రారంభించారని తెలిపారు. దీంతో ఆ మూడు గ్రామాల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే రాజా, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, సీనియర్ నాయకులు పేకేటి సూరిబాబు, యనమల వరహాలు, జిల్లా కమిటీ సభ్యుడు పేకేటి రాజేష్, సొసైటీ డైరెక్టర్ అంబుజాలపు సత్యనారాయణ తదితరులు దివీస్ పనులు జరుగుతున్న భూములను పరిశీలించారు. అక్కడ చెట్టు నరుకుతున్న కూలీలతో ఎమ్మెల్యే చర్చించారు. పనులు నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా తాటియాకులపాలెం రైతు నేమాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, తన భూమిలో బలవంతంగా పాకలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాకు వివరించారు. దీనిపై ఆగ్రహించిన బాధిత రైతులు, మహిళలు పాక ఏర్పాటుకు వేసిన స్తంభాలను తొలగించారు. తాటాకులను, దూలాలను తగులబెట్టారు.
కాలుష్య పరిశ్రమ తరలేవరకూ పోరాటం
పంపాదిపేటలో జరిగిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, తీరప్రాంత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని, కాలుష్య పరిశ్రమ తరలిపోయే వరకూ రైతుల పక్షాన పోరాడతానని భరోసా ఇచ్చారు. అమాయక రైతుల వద్ద భూములను అప్పనంగా కొట్టేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. దివీస్ ల్యాబ్‌్సకు ఫలానా ప్రాంతంలోనే భూములు కేటాయిస్తామని ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదన్నారు. కానీ చౌకగా భూములు ఇప్పించేందుకు ఈ పరిశ్రమ కుంపటిని ఈ ప్రాంత అధికార పార్టీ నేతలు తెచ్చిపెట్టారన్నారు.
‘‘సెజ్ పేరుతో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో వేలాది ఎకరాలు సేకరించారు. ఖాళీగా ఉన్న ఆ భూములను దివీస్‌కు ఎందుకు కేటాయించలేదు? చిన్న, సన్నకారు రైతులకు చెందిన సుమారు 505 ఎకరాల కోన భూములను కేటాయించడం వారికి పూర్తిగా అన్యాయం చేయడమే. సెజ్‌లో ఎకరాకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల చొప్పున చెల్లించి భూములు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దివీస్ యాజమాన్యం ఖర్చు చేయాలి. కానీ అలా చేయకుండా ఎకరా రూ.5 లక్షలకే లాక్కొని పేదలైన కోన రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. పొరుగున ఉన్న విశాఖ జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన చర్చల్లో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇప్పిస్తామని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రకటించారు. దీనికి అక్కడి రైతులు అంగీకరించకపోవడంతో రూ.24 లక్షలు ఇప్పిస్తానని చెప్పారు. అయినా భూములు ఇచ్చేందుకు రైతులు సమ్మతించలేదు. ఆ భూములకంటే సారవంతమైన కోన భూములను ఎకరాకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చి సేకరించాలని చూడడం పూర్తిగా అన్యాయం’’ అని ఎమ్మెల్యే వివరించారు. ఈ కాలుష్య పరిశ్రమవల్ల తరతరాల నుంచి ఇక్కడ జీవిస్తున్న ప్రజలు భూములను వదిలి పూర్తిగా వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురిస్తుందని, పుట్టబోయే బిడ్డలు అంగవైకల్యంతో జన్మించే ప్రమాదం ఉంటుందని అన్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే పరిశ్రమలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టారని.. అధికార బలంతో ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు.
Advertisement