ఇంజినీరింగ్‌లో నిరాశ
- ఎంసెట్ ఫలితాలు విడుదల
- ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకులు సాధించని జిల్లా విద్యార్థులు
–మెడిసిన్, అగ్రికల్చర్‌లో మనోజ్ పవన్‌రెడ్డికి ఆరో ర్యాంకు
జేఎన్‌టీయూ : ఎంసెట్–2017 ఫలితాలు జిల్లాకు నిరాశ మిగిల్చాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు సాధించడంలో ‘అనంత’ విద్యార్థులు విఫలమయ్యారు. ఈ విభాగంలో మొత్తం 8,100 మంది విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6,799 మంది అర్హత సాధించారు. టాప్–10లో ఒక్కరూ లేకపోవడం, అదీ ఇలా జరగడం తొలిసారి కావడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో ఎన్. పవన్ కుమార్ (334 ర్యాంకు ), రాయపాటి యశ్వంత్‌కుమార్ (510), చిట్టాడ పవన్‌కళ్యాణ్ (1,015), గొల్లపల్లి రూప(1,508 ), కె.రోహిత్ కుమార్ (1,550) , ఎం.మహేంద్రరెడ్డి (1,733), ఏ.జశ్వంత్‌రెడ్డి (1,765), పి.రుక్మానందరెడ్డి (1,833), హజీ ముజామిల్ ( 2,156), ఎం.నూరుల్లా ( 2,704), బి.మోక్షిత్ దాస్ (2,731), బి.గిరితేజ (2,781) మాత్రమే చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించారు.
ఇక అగ్రికల్చర్, వెటర్నరీ, డెంటల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో (ఎంబీబీఎస్ ప్రవేశాలు ‘నీట్’లో ర్యాంకుల ఆధారంగా కల్పిస్తారు) హిందూపురానికి చెందిన జి.మనోజ్ పవన్ కుమార్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. 146.47 స్కోరు సాధించి గణనీయమైన ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అలాగే షేక్ గుట్టూరు ఆప్సా నజ్నీన్ 563వ ర్యాంకు , పి.నబిలాఅక్తర్ 960, జి.సతీష్ చంద్ర 1,016, బి.చేతన 1,084, ఎల్.ప్రత్యూష 1,286, జి.లావణ్య 1,309, టి.అనూష 1,473, ఎం.నిహారిక 1,898, సి.శ్రీనాథ్ 1,968వ ర్యాంకు సాధించారు.