
ఏనుగులు తినేసిన ధాన్యం, పీకేసిన పాకలను చూపుతున్న బాధితులు
ఎల్.ఎన్.పేట : మండలంలోని చొర్లంగి పంచాయతీ కొత్తవలస గిరిజన గ్రామంపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నాలుగు ఏనుగుల గుంపు దాడి చేశాయని అదే గ్రామానికి చెందిన బాధిత గిరిజనులు స్థానిక విలేకరులకు బుధవారం తెలిపారు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఏనుగుల అరుపులు వినిపించి ఇళ్లనుంచి బయటకు వచ్చి చూశామని చెప్పారు. అప్పటికే గ్రామానికి సమీపంలోకి ఏనుగులు వచ్చాయని, భయంతో పరుగులు తీశామని, కొందరు శ్లాబు ఇళ్లు పైకి ఏక్కి భయం భయంగా రాత్రంతా గడిపామని తెలిపారు. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు వీధుల్లో తిరగడంతో పాటు పాకలు పీకేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సవర జమ్మయ్య, సవర కురమయ్య, సవర కాంతారావు, సరవ అనపయ్యలతో పాటు మరికొందరికి చెందిన పాకలు పీకేయడం, దాచుకున్న ధాన్యం బస్తాలను కాలితో తొక్కేసి తినేశాయని బాధితులు వాపోయారు.
గ్రామానికి సమీపంలో ఉన్న వరి పంటలను కూడా తొక్కేశాయని తెలిపారు. గత ఏడాది తమ గ్రామానికి కాస్త దూరం నుంచి ఏనుగులు వెళ్లిపోయాయని, ఇప్పుడు గ్రామంలోకే ప్రవేశించాయన్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ మహాంతి సూర్యనారాయణ, ఎంపీటీసీ శివ్వాల కిశోర్‌బాబు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు.