నగరాన్ని వణికిస్తున్న ఫీవర్!
నల్లకుంట: వ్యాధులు ప్రబలుతుండడంతో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. ఆస్పత్రి ఓపీ విభాగం ఉదయం 12 గంటలకే మూసి వేస్తుండడంతో చికిత్సల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. పైగా వందల సంఖ్యలో వస్తున్న రోగులు గంటల కొద్దీ క్యూలైన్‌లో వేచి ఉంటుండడంతో తొక్కిసలాట జరుగుతోంది. సోమవారం తొక్కిసలాటలో కొందరు రోగులు సొమ్మసిల్లి పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ శంకర్ మంగళవారం ఉదయం ఓపీ క్యూలైన్ పరిశీలించారు. రద్దీని బట్టి ఓపీ సమయాన్ని సాయంత్రం 4 గంటల వరకు పొడిగిస్తామని రోగులతో చెప్పారు.
కొందరు వైద్యులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఓపీ సమయాన్ని పొడిగించకుండా మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూలైన్‌లో వేచి ఉన్న రోగులందరినీ పరీక్షిస్తామని వైద్యులు తెలిపినట్లు సమాచారం. దీంతో సూపరెంటెండెంట్ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని తెలిసింది. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సమయాన్ని పొడిగిస్తే వైద్యులకు డబుల్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఫార్మసీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇంక్రిమెంట్లు ఉండవు. అలాంటప్పుడు సమయాన్ని పొడిగించడం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ‘ఫార్మసీ క్యూలో రోగులకు తప్పని ఇక్కట్లు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు రోగులకు మందులు ఇచ్చేందుకు మరో ఉద్యోగిని తీసుకున్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో వైద్యం కోసం బారులు తీరిన ప్రజలు