ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాటం
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పోరాటం
Published Sat, Oct 22 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
– సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమమే లక్ష్యం
– వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి
– ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి జగన్ హామీ : హఫీజ్ ఖాన్
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరు కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్‌లోని రీజినల్ మేనేజరు కార్యాలయంలో ఆర్‌ఎం వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎంపికైనా రీజియన్ (జిల్లా) కమిటీని ఆర్‌ఎంకు పరిచయం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, కింది స్థాయి సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు. రోజురోజుకు బస్సుల సంఖ్యను తగ్గించడం, అద్దె బస్సులను పెంచడంతో ప్రైవేటు పరం అవుతుందనే అభద్రతాభావంతో కార్మికులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి మానసికంగా ఆందోళనలకు గురవుతున్నారని చెప్పారు. చట్ట విరుద్ధంగా ప్రైవేటు వాహనాదారులు ప్రయాణికులను తీసుకెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమాన్నారు. నష్టాల పేరుతో సర్వీసులను తగ్గిండం సరి కాదన్నారు.
అనంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయ కర్త, ఆర్టీసీ యూనియన్ కర్నూలు–2డిపో గౌరవ అధ్యక్షుడు ఎంఎ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి గత టీడీపీ పాలనలో ఆర్టీసీ పరిస్థితి మునిగిపోయే నావాలా ఉండేదని, అయితే 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదుకుని జీవం పోశారని గుర్తు చేశారు. ఆయన తరువాత ఆర్టీసీని పట్టించుకునే నాథుడు కరువయ్యారని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయక వేలాంది మంది చవువుకున్న నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు అన్ని సంఘాల తరహాలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కూ సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఆర్‌ఎం స్పందించి ప్రతి నెలా రెండు సార్లు యూనియన్ నాయకులు కలిసేందుకు సమయం ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు బి. చంద్రశేఖర్, జి. సెబాస్టీయన్, ముఖ్య సలహాదారు వై. మాధవస్వామి, 2డిపో నాయకులు ప్రభుదాస్, నాగన్న, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పేలాల రాఘవేంద్ర, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement