దొంగతనం కేసులో ఐదుగురి రిమాండ్
దొంగతనం కేసులో ఐదుగురి రిమాండ్
Published Tue, Sep 6 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
గుండాల : మండల పరిధిలోని టి.శాపురం, వెల్మజాల మధిర బూర్జుబావి గ్రామాల్లో ఇటీవల జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుండాల మండల పరిధిలోని టి.శాపురంలో ఆగస్టు 5వ తేదీ రాత్రి 24 గొర్రెలు, ఆగస్టు 23వ తేదీ వెల్మజాల మధిర బూర్జుబావి గ్రామంలో 37 గొర్రెలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సోమవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం విషయం బట్టబయలైందన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు మండలానికి చెందిన బానావత్ బోజానాయక్, బానావత్ రమేష్, దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి బానారి వెంకన్న, గుండాల మండలం వెల్మజాల మధిర గ్రామం బూర్జుబావికి చెందిన వల్లాల మహేందర్, తోటకూరి యాదయ్యలు దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.1.91 లక్షలు రికవరీ చేసి నిందితులను భువనగిరి కోర్టు మెజిస్ట్రేట్ వద్ద సోమవారం రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మైసయ్య, రమేష్, అజిత్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నాగయ్య, రామచంద్రు, బాలకృష్ణ పాల్గొన్నారు.
Advertisement