కంది సాగుపై రైతు ఆసక్తి | former intrested in kandiCultivation | Sakshi
Sakshi News home page

కంది సాగుపై రైతు ఆసక్తి

Published Tue, Jul 12 2016 1:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

కంది సాగుపై రైతు ఆసక్తి - Sakshi

కంది సాగుపై రైతు ఆసక్తి

ఇప్పటికే 31 వేల హెక్టార్లలో..
గతేడాదితో పోలిస్తే 7 వేల హెక్టార్లు అధికం
మరింత పెరిగే అవకాశం
వర్షపాతం తగ్గినవేళ... ‘ఆరుతడి’గా సాగు

 గజ్వేల్ : ‘కంది’ సాగుకు జిల్లా రైతు జై కొడుతున్నాడు. జిల్లాలో వర్షపాతం తగ్గినవేళ.. ‘ఆరుతడి’గా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఈ పంట సాగు తగ్గిన కారణంగా ఉత్పత్తులు పడిపోయి..పప్పుదినుసుల కొరత ఉత్పన్నమవడం..ఈ పరిస్థితిని మార్చడానికి వ్యవసాయశాఖ ప్రచారం హోరెత్తించడం..సాగు పెరగడానికి మరో కారణం. మున్నెన్నడూలేని విధంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 31వేల హెక్టార్లలో సాగులోకి వచ్చింది. కొద్ది రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నది. గతేడాది ఖరీఫ్‌లో సీజన్ మొత్తానికి 24 వేల హెక్టార్లకే సాగు పరిమితం కాగా నేడు.. ఇప్పటికే 31 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని ‘పప్పు దినుసుల సంవత్సరం’గా ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషం.

 జిల్లాలో ఏటా 5 లక్షల హెక్టార్లకుపైగా పంటలు సాగులోకి వస్తుంటాయి. ఇందులో మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణమే అత్యధికం. మూడో స్థానంలో వరి, కురగాయలు ఉంటాయి. కంది, సోయాబీన్,  మినుములు, పెసర్లు లాంటి పప్పుదినుసుల సాధారణంగా చివరి స్థానంలో ఉంటాయి. కానీ ఈసారి జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. 4.34 లక్షల సాధారణ విస్తీర్ణానికి గానూ ఇప్పటి వరకు 2.64లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. అంటే 60శాతం పంటలు సాగులోకి వచ్చాయన్నమాట. జూన్‌లో 125.6మి.మీ వర్షపాతానికి 136.9 మి.మీలు నమోదు కాగా జూలై ఇప్పటివరకు 77.7 మి.మీల వర్షపాతానికి 49.1 మాత్రమే నమోదు కాగా 38.8 మి.మీల వర్షపాతం మైనస్ ఉన్నది. ఇందువల్ల విత్తన ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటివరకు ప్రధాన పంటలు మొక్కజొన్న 92,815 హెక్టార్లు, పత్తి 69 వేల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. మిగతా విస్తీర్ణంలో ఇతర పంటలను సాగుచేశారు.

పెరిగిన పప్పు దినుసుల సాగు
ఈసారి పప్పుదినుల సాగును పెంచడానికి వ్యవసాయశాఖ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తున్నది. పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులను సాగు చేసుకోవాలని ప్రచారం నిర్వహించడం.. ఈసారి కూడా వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ‘ఆరుతడి’గా  కంది సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది సీజన్ మొత్తంలో కంది 24,263 హెక్టార్లు, పెసర్లు 25,154 హెక్టార్లు, సోయాబీన్ 26,007 హెక్టార్లు, మినుములు 12,943 హెక్టార్లు.. మొత్తం 88,367 హెక్టార్లలో సాగులోకి వస్తే...ఈసారి ఇప్పటికే కంది 31 వేల హెక్టార్లు, సోయాబీన్ 24,485వేల హెక్టార్లు, మినుములు 11,638వేల హెక్టార్లు, పెసర్లు 20,574వేల హెక్టార్లు.. మొత్తం 87,697వేల హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. రానున్న రోజుల్లో విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో ప్రత్యేకించి కంది సాగు గతేడాదితో పోలిస్తే ఇప్పటికే 7వేల హెక్టార్లు పెరగడం విశేషం. జహీరాబాద్‌లో అత్యధికంగా ఇప్పటి వరకు 4,176 హెక్టార్లు, గజ్వేల్‌లో 3,600 హెక్టార్లు, నారాయణఖేడ్‌లో 3,400 హెక్టార్లలో సాగులోకి వచ్చింది.

 ‘కంది’ సాగులో నూతన ఒరవడి
కంది సాగులో రెండేళ్లుగా నూతన ఒరవడి రైతుల్లో ఆసక్తిని కలిగిస్తున్నది. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రయోగాలతో కందిలో అద్భుత ఫలితాలను సాధించారు. ఏడీఏ శ్రవన్‌కుమార్ నేతృత్వంలో 2014 నుంచి ఇక్కడి పొలాల్లో కర్ణాటక, బీదర్ పరిశోధనాకేంద్రం నుంచి తెప్పించిన బీఎస్‌ఎంఆర్ 736 రకాన్ని 2014లో వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన భాస్కర్ అనే రైతు పొలంలో సాగుచేయించారు. అతను ఎకరాకు 12-16క్వింటాళ్ల దిగుబడి సాధించాడు. ఇదే ఉత్పత్తులను విత్తనంగా మార్చి రైతులకు సరఫరా చేస్తున్నారు. 2015లో ములుగు మండలం జప్తి సింగాయపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి 2 ఎకరాల్లో, సింగాటంలో మల్లేశం ఎకరా, అదే గ్రామంలో రాంచంద్రారెడ్డి 2 ఎకరాలు, అహ్మదీపూర్‌లో ఆగయ్య ఎకరా విస్తీర్ణంలో సాగుచేసి మంచి ఫలితాలను పొందారు.

ఈ రైతులు సాగుచేసిన ఉత్పత్తులను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలుగా జిల్లాలోనే కాకుండా కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల రైతులకు సరఫరా చేశారు. ఇదిలా ఉంటే కంది విత్తనాలను ట్రేలల్లో నాటి నారు పెంచి నెల వ్యవధిలో నాటువే సే విధానం కూడా కొత్తగా తీసుకువచ్చారు. సాళ్లుగా నాట్లు వేయడం వల్ల మొక్కల సాంద్రత అనుకున్నంతగా ఉంటుంది. కలుపు ఇబ్బంది ఉండకపోగా చేను ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం ట్రేలల్లో నారు పెంచే విధానం గజ్వేల్ మండలం శేరుపల్లిలో అమలు చేస్తున్నారు. ఇక్కడ పెంచిన నారు గ్రామంలో సుమారు 10ఎకరాల్లో నాటి మంచి ఫలితాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

 కందిసాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు
జిల్లాలో పప్పు దినుసుల సాగు పెరుగుతుంది. ప్రత్యేకించి కంది సాగుపై రైతులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మా ప్రచారం ఫలిస్తున్నది. ఈసారి జిల్లాలో పప్పుదినుసుల కొరత ఉండదని భావిస్తున్నాం. - జేడీఏ మాధవీశ్రీలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement