తెల్ల‘బంగారం’పైనే ఆశలు | farmers hopes on white gold (cotton) | Sakshi
Sakshi News home page

తెల్ల‘బంగారం’పైనే ఆశలు

Published Thu, Oct 1 2015 1:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

తెల్ల‘బంగారం’పైనే ఆశలు - Sakshi

తెల్ల‘బంగారం’పైనే ఆశలు

గజ్వేల్: తీవ్ర వర్షాభావం నెలకొన్న వేళ.. పంటలన్నీ ఆగమై కునారిల్లుతున్న మెతుకుసీమ రైతు కాస్తోకూస్తో.. తెల్ల‘బంగారం’పై ఆశలు పెట్టుకున్నాడు.. జిల్లాలో ప్రధాన పంటగా ఆవిర్భవించిన పత్తి మరో వారం తర్వాత మార్కెట్ బాట పట్టే అవకాశమున్నది. అధికార యంత్రాంగం గిట్టుబాటు ధర అందించే విషయంలో ముందస్తు ప్రణాళికతో ముందుకుసాగితే తప్పా రైతులకు మేలు చేకూరే అవకాశం లేదు. గతేడాది ఇబ్బడిముబ్బడిగా నిల్వలున్నా సీసీఐ కేంద్రాలు సక్రమంగా నడవక రైతులు వ్యాపారులను ఆశ్రయించి అతితక్కువ ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకున్నారు.

ఈ విధంగా కొనుగోలు చేసిన ఉత్పత్తులను మాత్రం వ్యాపారులు రైతుల ‘అవతారం’లో అమ్ముకొని లాభపడ్డారు. ఫలితంగా రైతులకు ధర రూపేణా కోట్లల్లో నష్టం జరిగింది. ఈసారైనా చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ‘గిట్టుబాటు’ అందించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు..
 జిల్లాలో ఈసారి పత్తి 1.20 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చి ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రైతులు ఈ పంటపై ‘మమకారం’ ప్రదర్శించారు. ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు లేకపోవడంవల్ల ఈ పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఒక్కోరైతు రెండు నుంచి మూడుసార్లు విత్తనాలు చెడగొట్టి వేసుకోవాల్సి వచ్చింది. విత్తనాలు, ఇతర పెట్టుబడులు రూపంలో అప్పటికే కోట్లల్లో నష్టం జరిగిపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో కురిసిన వర్షాలకు నల్లరేగడి భూముల్లో పంటలు కోలుకున్నాయి. చెలక నేలల్లో మాత్రం పంట భారీగా దెబ్బతిన్నది. మొత్తానికి జిల్లావ్యాప్తంగా పంట దిగుబడులపై విపరీతమైన ప్రభావం చూపింది. చేతికందే కొద్దిపాటి దిగుబడులకైనా ఈసారి ‘గిట్టుబాటు’ అందుతుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరో పది రోజుల తర్వాత ఉత్పత్తులు మార్కెట్ బాటపట్టే అవకాశముండగా అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో కొనుగోళ్లు చేపడితే తప్పా రైతులకు లాభం జరిగే అవకాశంలేదు. ఈసారి మద్దతు ధరను రైతులు 5వేల వరకు ఆశిస్తే ప్రభుత్వం గతేడాది ఉన్న మద్దతు ధర రూ.3750-4050కు స్వల్పంగా మరో రూ.50మాత్రమే పెంచింది. ఈ లెక్కన ఈసారి రూ.3800-4100 ధర వర్తిస్తుంది. గతేడాది చోటుచేసుకున్న చేదు అనుభవాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.  
 
గతేడాది ఇలా....
జిల్లాలోని గజ్వేల్, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సక్రమంగా నడవక ప్రకటించిన మద్దతు ధర రూ.4050కూడా ఎక్కడా అందలేదు. సీసీఐ నిర్ణయాన్ని అదునుగా భావించిన వ్యాపారులు ధరను అమాంతం తగ్గించేశారు. సీసీఐ కొనుగోళ్లు ఎప్పుడు జరుగుతాయో, ఎప్పుడు బందవుతాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించగా ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ట్రేడర్లు ధర అత్యల్పంగా రూ.3500-3800వరకు మాత్రమే చెల్లించారు. ఇకపోతే రైతుల రూపంలో వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ఉత్పత్తులను అమ్ముకొని లక్షల రూపాయల మార్కెట్ ఫీజును ఎగ్గొట్టారు. ఈ వ్యవహారాన్ని గతేడాది ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెల్సిందే.
 
సీసీఐ కమర్షియల్ పర్చేజ్ చేపడితేనే మేలు...
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే పత్తికి బహిరంగ మార్కెట్‌లో అధిక రేటు వస్తే.. సీసీఐ స్పందించి వ్యాపారులకు ధీటుగా కమర్షియల్ దిగాల్సిన అవసరమున్నది. 2011 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మార్కెట్‌లో ఇదే రకమైన పరిస్థితులు ఉత్పన్నమైన తరుణంలో మద్దతు ధరతో ప్రమేయంలేకుండా  సీసీఐ కూడా కమర్షియల్ పర్చేజ్‌కు దిగింది. సీసీఐ అప్పట్లో క్వింటాలుకు గరిష్టంగా రూ.6,900 వరకు ధరను రైతులకు చెల్లించింది. సీసీఐ ఈసారి కూడా అదే తరహాలో స్పందిస్తే ప్రయోజనం కలిగే అవకాశమున్నది.
 
గుర్తింపు కార్డుల విధానం అమలుపై ఆశలు
పత్తి కొనుగోళ్లల్లో మధ్య దళారుల ప్రమేయాన్ని అరికట్టే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్తగా పత్తి రైతులకు ‘గుర్తింపు కార్డుల’ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది.  రెవెన్యూ, వ్యవసాయశాఖలు కసరత్తును ప్రారంభించాయి. పత్తిని ఉత్పతి చేసి మార్కెట్ కమిటీలకు అమ్మకాల కోసం వచ్చే రైతులకు గుర్తింపు కార్డులు, ఇందులో బార్‌కోడింగ్ నెంబర్ ఇవ్వనున్నారు. ఈ కార్డు ఉన్న రైతులకు మాత్రమే మద్ధతుధర అందుతుంది. ఈ కార్డుతో రైతు  ఎక్కడైనా తన ఉత్పత్తులను అమ్ముకొని మద్దతు ధర పొందే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement