అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ధ్వజమెత్తారు.
- కమీషన్ల కోసమే ప్యాకేజీలు
తుని (తూర్పుగోదావరి జిల్లా) : అమరావతి రాజధాని పేరుతో టీడీపీ నేతలు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్యాకేజీ సాధించిన సీఎం చంద్రబాబు కమీషన్లు దండుకునేందుకే కల్లబొల్లి మాటలు వల్లిస్తున్నారని విమర్శించారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టరు సీహెచ్ పాండురంగారావు ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ చైతన్య యాత్ర సమావేశానికి హాజరైన పళ్లంరాజు బీజేపీ, టీడీపీలపై నిప్పులు చెరిగారు.
రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు కాకుండా రాష్ట్రానికి అదనంగా ఏమి తెచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందన్న విషయాన్ని విస్మరించారని తప్పు పట్టారు. సంక్షేమ పథకాలను జన్మభూమి కమిటీలకు అప్పగించి కార్యకర్తల జేబులు నింపుతున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర మాజీ మంత్రి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి జేడీ శీలం మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ ఇవ్వాలని చేర్చిన విషయాన్ని బీజేపీ, టీడీపీ పక్కదారి పట్టించాయన్నారు. టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీని ప్రశ్నించేందుకు భయపడుతున్నారన్నారు. ప్యాకేజీని హోదా తో ముడిపెట్టడం సరికాదన్నారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి లో పటిష్టం చేసేందుకు తూర్పు సెంటిమెంట్‌తో తుని నుంచి చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, పరిశీలకుడు పక్కాల సూరిబాబు పాల్గొన్నారు.