కష్టం వారిది... కలరింగ్ మాత్రం ... | Gadde rammohan rao one man show in his constituency | Sakshi
Sakshi News home page

కష్టం వారిది... కలరింగ్ మాత్రం ...

Published Wed, Sep 30 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

కష్టం వారిది... కలరింగ్ మాత్రం ...

కష్టం వారిది... కలరింగ్ మాత్రం ...

విజయవాడ: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రచార ఆర్భాటానికి తెర తీశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల కాకున్నా.. స్థానిక సంస్థలకు వచ్చే ప్రత్యేక నిధులతో చేపట్టే పనులను తామే చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. కార్పొరేటర్లు కాళ్లరిగేలా నగరపాలక సంస్థ చుట్టూ తిరిగి మంజూరు చేయించుకున్న పనులకు సైతం తామే కొబ్బరికాయ కొట్టాలంటూ ఇంజనీర్లకు హుకుం జారీ చేస్తున్నారు. తమ స్థాయిని మరచి వేల రూపాయలతో చేపట్టే పనులకు సైతం భూమిపూజలు చేస్తూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు.
 
దీంతో తమను ఉత్సవ విగ్రహాలుగా చూస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లలోనే కాదు.. స్వపక్షంలోనూ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. చిన్న చిన్న పనులకు సైతం ఎమ్మెల్యే వచ్చేస్తుంటే డివిజన్ ప్రథమ పౌరునిగా ఇంకా తామెందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై 17, 18, 22, 4 డివిజన్‌ల కార్పొరేటర్లు కౌన్సిల్‌లో అభ్యంతరం లేవనెత్తిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో అధికార పక్షానికి చెందినవారు సైతం వాస్తవమేనని పేర్కొనడం విశేషం. ఆయన తీరు స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేసేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. ఇదే విషయమై కొందరు కార్పొరేటర్లు మేయర్ వద్ద వాపోగా, తన పరిస్థితీ అంతేనన్నట్లు ఆయన మాట్లాడటం కొసమెరుపు.
 
 మీ హామీలు ఏమయ్యాయి?
*ఎన్నికల్లో గెలిస్తే కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మిస్తానన్నారు. ఆరు నెలల కిందట సర్వే అంటూ హడావుడి చేశారు. ఇప్పుడేమో నదుల సుందరీకరణ పేరుతో కరకట్ట వాసుల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై మీరే మీ నోరు మెదపడం లేదు.  
* నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వాస్పత్రిలో తాగునీరు లేకున్నా పట్టించుకోరు. అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ప్లాంట్లే ఆధారం. *సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌కు కేంద్రం నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాటా విషయం తేల్చలేదు. దీనిపై మీరు స్పందించరేం?
*పటమట, కరెన్సీనగర్, మొగల్రాజపురం కొండ ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీటినే తీసుకుంటున్నారు. మొగల్రాజపురానికి పైప్‌లైన్ వేసినా బూస్టర్‌తోనే సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది?
*బి-ఫారం పట్టాలున్న వారందరికీ ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. ఇప్పుడేమో వందగజాల లోపు ఉన్న కొండప్రాంతాల వారికే అంటున్నారు. మిగిలిన వారి పరిస్థితేమిటి?
*ఎమ్మెల్యే దత్తత తీసుకున్న డివిజన్‌లోనే కలుషిత మంచినీరు తాగే పరిస్థితి ఉంది. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
*10 ఎంజీడీ వాటర్ ప్లాంట్ కుంగి పనిచేయడం లేదు. దాని స్థానంలో కొత్తది నిర్మాణం చేపట్టే ఊసే లేదు.
 *రామలింగేశ్వర నగర్‌లో ఎస్టీపీతో తలెత్తే దుష్ఫలితాలను అరికడతానన్నారు. ఇంతవరకూ ఆ చర్యలేమీ  
 
ప్రచారానికే పెద్దపీట...
నిత్యం డివిజన్‌లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే, ఆ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించిన సందర్భాలు లేవు. కానీ ఏ నిధుల నుంచి పనులు చేపట్టినా.. తనకు తెలియకుండా టెంకాయ కొట్టడానికి వీలు లేదని ఇంజనీరింగ్ అధికారులకు హుకుం జారీ చేయడంతో వారు ప్రతి చిన్నపనికి ఎమ్మెల్యేను పిలుస్తున్నారు.

దీంతో కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము డివిజన్‌లోని సమస్యలను గుర్తించి కౌన్సిల్‌లో ఆమోదం అనంతరం నిధులు మంజూరు చేయిస్తుంటే.. వాటికి కూడా ఎమ్మెల్యే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక పనులు ప్రారంభించేటప్పుడు కార్పొరేటర్లకు కాకుండా తన అనుచరులను తీసుకొచ్చి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు.
 
 కార్పొరేటర్లను గౌరవిస్తున్నాం
 నియోజకవర్గ అభివృద్ధికి రూ.16 కోట్ల నిధులు తీసుకొచ్చా. ప్రతిరోజూ డివిజన్‌లో మూడు గంటలు పర్యటిస్తున్నా. ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటున్నా. అందుకే అభివృద్ధి పనులు నాకు చెప్పకుండా చేయొద్దని అధికారులకు సూచించా. ఎక్కడ ఏది అవసరమో తెలుసుకొని చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి కొబ్బరికాయ కార్పొరేటర్‌తో కొట్టిస్తున్నా, చివరి కొబ్బరి కాయ నేను కొడుతున్నా. ఇందులో తప్పేంటి. ప్రొటోకాల్ ప్రకారం కార్పొరేటర్లందరినీ గౌరవిస్తున్నాం.     
 - గద్దె రామ్మోహన్,
 తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే
 
 కార్పొరేటర్లను డమ్మీ చేస్తున్నారు
 మా డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంలో స్థానిక కార్పొరేటర్‌ని డమ్మీ చేస్తూ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మేము గెలిచి ప్రయోజమేముంది. కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనికీ డివిజన్‌లో కార్పొరేటర్‌కి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా అలా జరగడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేస్తున్నారు.
 - పళ్లెం రవి, 22వ డివిజన్ కార్పొరేటర్
 
 ఇంజనీర్లపై ఒత్తిడి చేస్తున్నారు
 మా డివిజన్‌లోని పార్కు రోడ్డు అభివృద్ధి కోసం కౌన్సిల్‌లో అనేక ప్రతిపాదనలు పెట్టించి పనులు ప్రారంభించాం. దీనికి తనను పిలవలేదని ఎమ్మెల్యే ఇంజనీర్లపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మిడ్‌సిటీ రోడ్డు కూడా నేను లేఖ ఇవ్వడంతో మంజూరైంది. ఈ పనుల విషయంలోనూ అధికారులపై ఒత్తిడి చేశారు. తమకు తెలియకుండా ఏ పనీ ప్రారంభించవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తే, డివిజన్‌లలో మేమున్నది ఎందుకు?    
 - చోడిశెట్టి సుజాత, 17వ డివిజన్ కార్పొరేటర్
 
 కార్పొరేటర్లను పట్టించుకోవట్లేదు
 డివిజన్‌లో శంకుస్థాపనల సమయంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు మమ్మల్ని వెనక్కి నెట్టేసి వాళ్లే ముందుకు వెళ్లిపోతున్నారు. మేము ప్రజాప్రతినిధిగా రోడ్లు మంజూరు చేయిస్తుంటే, ఎమ్మెల్యే వచ్చి కొబ్బరి కాయలు కొడుతూ అన్నీ తామే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.
 - దాసరి మల్లేశ్వరి, 4వ డివిజన్ కార్పొరేటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement