ఫరీన్ సుల్తానా మృతదేహం
• ఏడేళ్ల బాలిక దుర్మరణం..
• బాలాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
హైదరాబాద్: తాడుతో ఆటలాడిన చిన్నారికి ఆ తాడే ఉరిగా బిగిసింది. తెలిసీ తెలియక మెడకు చుట్టుకున్న తాడు యమపాశమరుుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపూర్ సీమ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ వాహెద్‌ఖాన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. భార్య బ్యూటీపార్లర్‌లో పనిచేస్తుంది. శనివారం ఉదయం రోజూలాగే భార్యాభర్తలిద్దరూ తమ పనులపై బయటకు వెళ్లారు. నలుగురు పిల్లలూ ఎప్పటిలానే ఇంటివద్దే ఉన్నారు. ఏడాది వయసున్న చిన్న కుమార్తె సోఫియా సుల్తానా అల్లరిని కట్టడి చేయడానికి తల్లిదండ్రులు ఆమె నడుమును తాడుతో కట్టేశారు.
తల్లిదండ్రులు బయటకు వెళ్లగానే... వారి పెద్ద కుమార్తె ఫరీన్ సుల్తానా (7) సినిమాల్లో మాదిరిగా... చెల్లి నడుముకు కట్టే తాడు ముడిని తన మెడలో వేసుకుని... కాళ్ల కింద బకెట్ పెట్టుకుని ఆడసాగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా బకెట్ జారి.... తాడు బిగుసుకోవడంతో ఫరీన్ మృతిచెందింది. చలనం లేకుండా పడివున్న ఫరీన్‌ను చూసిన మిగిలిన పిల్లలు... తను నిద్రపోతోందని భావించి ఇంట్లో పడుకోబెట్టారు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన భార్యాభర్తలు... ఫరీన్‌ను చూసి గాభరాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. అర్ధరాత్రి బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.