‘123 జీవో రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు’
నిజామాబాద్ సిటీ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ భూసేకరణకు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 123ను రాష్ట్ర హైకోర్టు రద్దు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కాంగ్రెస్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారన్నారు. ప్రతిపక్షాలు కూడా రైతుల పక్షాన నిలబడ్డాయన్నారు. 123 జీవో సరైందేనని సమర్థించుకున్న సీఎం కోర్టు తీర్పుపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 2013లో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో తప్పుడు లెక్కలు చోటు చేసుకున్నాయని, వీటిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్ సుజాత, మున్సిపల్ అధికారులు సీఎం ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు పోశెట్టి స్వయంగా విమర్శించటం ఆ పార్టీకి సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి మోహన్‌రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్‌హైమద్, నాయకులు బంటు రాము, విపుల్‌గౌడ్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్, ఎస్టీసెల్ నగర అధ్యక్షుడు సుభాష్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.