అక్రమాలకు ‘అండ’
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో భారీ గోల్‌మాల్ జరుగుతోంది. నాసిరకంగా ఉన్నవి.. గోలీ కాయల్లాంటి గుడ్లు సరఫరా చేస్తూ కాంట్రాక్టర్లు చేతివాటం చూపుతుండగా ఐసీడీఎస్ అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారు. గుడ్ల సరఫరాలో ఎక్కడా ప్రమాణాలు పాటించకపోవడంతో అవినీతి తారస్థాయికి చేరుతోంది.
- అనంతపురం టౌన్
తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషక విలువలతో కూడిన ఆహారం సరఫరా చేస్తోంది. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులు రక్తహీనతతో తల్లడిల్లుతుండడం..తక్కువ బరువున్న శిశువులకు జన్మనిస్తుండడంతో వారికి కోడిగుడ్లు అందించాలని నిర్ణయించాయి. లక్ష్యం ఉదాత్తమైనదే అయినా ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. క్షేత్రస్థాయిలో భారీ ఎత్తున అక్రమాల భాగోతం జరుగుతోంది. జిల్లా యంత్రాంగం దృష్టి కేంద్రీకరించకపోవడంతో స్వార్థపరులు రెచ్చిపోతున్నారు. గోలీకాయలను తలపించేవి..మురిగిపోయినవి సరఫరా చేస్తూ గుడ్ల మాటున గుటకాయ స్వాహా చేస్తున్నారు.
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులుండగా 4,286 మెయిన్, 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 1,49,339 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 96505 మంది ఉన్నారు. 35943 మంది గర్భిణులు , 36192 మంది బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. జిల్లాలోని గుత్తి, హిందూపురం, కదిరి (ఈస్ట్), కదిరి (వెస్ట్), కళ్యాణదుర్గం, కంబదూరు, కణేకల్లు, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం ప్రాజెక్టుల్లో ‘అన్న అమృతహస్తం’ అమలు చేస్తున్నారు. మిగిలిన అనంతపురం, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కూడేరు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ప్రాజెక్టుల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు.
గుడ్ల సరఫరాలో గోల్‌మాల్
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అన్న అమృత హస్తం అమలయ్యే ప్రాజెక్టుల్లో గర్భిణులు, బాలింతలకు వారానికి ఆరు, మూడేళ్లలోపు చిన్నారులకు రెండు, 3–6 ఏళ్లలోపు పిల్లలకు (కేంద్రంలోనే వండాలి) నాలుగు చొప్పున కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు వారానికి నాలుగు, మూడేళ్లలోపు పిల్లలకు రెండు, 3–6 చిన్నారులకు నాలుగు (కేంద్రంలోనే వండిపెట్టాలి) అందిస్తున్నారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కిశోర బాలికలకు వారానికి నాలుగు ఇవ్వాల్సి ఉంటుంది. నెలలో మొదటి 15 రోజుల్లో ఒకసారి, ఆ తర్వాత మరోసారి చొప్పున నెలకు రెండు సార్లు తప్పనిసరిగా గుడ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. ప్రాజెక్టుల్లోని అధికారులు అందినకాడికి దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. నాణ్యతను పరిశీలించకుండా బాధ్యతల్ని విస్మరించి దోచుకోవడమే పరమావధిగా పని చేస్తున్నారు. ఫలితంగా పథకం ఆశయం నీరుగారుతుండగా లబ్ధిదారులను పౌష్టికాహార లోపం వెంటాడుతోంది.
కుళ్లినవి వచ్చే ప్రసక్తి లేదు
అంగన్‌వాడీ సెంటర్లకు కుళ్లిన గుడ్లు వచ్చే ప్రసక్తి లేదు. ఒక వేళ వస్తే వాటిని సరఫరా చేసిన వారికే తిరిగిచ్చేయాలి. చిన్న గుడ్లు కూడా సరఫరా చేయడానికి వీల్లేదు. ఒక్కో గుడ్డు 45 నుంచి 50 గ్రాములుండాలి. - జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ