టేబుల్ టెన్నిస్‌కు పూర్వవైభవం
విజయవాడ స్పోర్ట్స్ : నవ్యాంధ్రలో టేబుల్ టెన్నిస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్ తెలిపారు. వరుసగా రెండుసార్లు టేబుల్ టెన్నిస్ స్టేట్ ర్యాంకింగ్ టోర్నీల్లో సబ్‌జూనియర్, జూనియర్, యూత్, ఉమెన్ కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచిన 14ఏళ్ల కాజోల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్ సోమవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో అభినందించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మెడిసిన్ వంటి చదువుల్లో స్పోర్ట్స్ కోటాలో సీట్లు సంపాదిస్తున్నారన్నారు. చదువు కూడా ముఖ్యం కావడంతో సీనియర్ విభాగంలో చాలావరకు క్రీడాకారులు కొరత ఉంటోందన్నారు. ఇటీవల రాజమహేంద్రవరం, అనంతపురంలో జరిగిన స్టేట్ ర్యాంకింగ్ టోర్నీల్లో కాజోల్ వరుసగా నాలుగు ఈవెంట్లలో గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో కాజోల్ సబ్ జూనియర్ విభాగంలో ఏడోస్థానంలో, మన రాష్ట్రంలో మొదటి ర్యాంకులో నిలిచిందని చెప్పారు. పేద కుటుంబం నుంచి వచ్చిన కాజోల్.. తొలుత కేబీఎన్ కళాశాలలోని టీటీ కోచ్ పాండు వద్ద శిక్షణ పొందారని, ప్రస్తుతం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బి.శ్రీనివాస్ వద్ద శిక్షణ పొందుతున్నట్లు చెప్పారు. నగరం నుంచి శైలూ నూర్‌బాషా ప్రస్తుతం ఇండోర్‌లో జరుగుతున్న వరల్డ్ క్యాడెట్, జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటోందన్నారు. పదేళ్లుగా శాప్ నుంచి టేబుల్ టెన్నిస్ కోచ్‌ల రిక్రూట్‌మెంట్ లేనప్పటికీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కోచ్‌లతోనే నెట్టుకొస్తున్నామన్నారు. అక్టోబరు 20 నుంచి 25వ తేదీ వరకూ విశాఖపట్నంలోని పోర్టు ఇండోర్ స్టేడియంలో నేషనల్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎస్‌ఎం సుల్తాన్‌తో పాటు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కరణం బలరామ్, కోచ్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.