గోరక్షక్ గుండాలపై అట్రాసిటీ కేసులు పెట్టాలి
బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు
బాపట్ల (మూలపాలెం): దళితుల పట్ల అధికార తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బహుజన కెరటాల వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు విమర్శించారు. గోరక్షక్ గుండాల చేతులో దాడికి గురై అమలాపురంలో చికిత్సపొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ దళితులపై దాడి జరిగి 10 రోజులు అవుతున్నా ఇప్పటివరకు ముఖ్యమంత్రికానీ, దళిత ఎంపీలు, ఎమ్మెల్యే ఇంతవరకు బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. అమలాపురంలో గుజరాత్ తరహా దాడులు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే కారణం అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు బహుజనులు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. బాధితులను పరామర్శించిన వారిలో బహుజన రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ జి. శ్రీనివాస్, డాక్టర్ కాకాని సుధాకర్, డాక్టర్ జి.ఎం. సాంబయ్య, గల్లా ప్రకాష్‌రాజ్, మూర్తిలు ఉన్నారు.