
గ్రాట్యుటీ పరిమితి రూ.10 లక్షలే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ముందు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇస్తోందని సాక్షి చెప్పినట్లే దీపావళి తరువాత శుక్రవారం ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిపై ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ.పది లక్షలకు పరిమితం చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్ శుక్రవారం జీవో-139 జారీ చేశారు. పదవ వేతన సరవణ కమిషన్ (పీఆర్సీ) మాత్రం ఉద్యోగుల గ్రాట్యుటీని రూ.12 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.ఈ సిఫార్సు మేరకో లేదా అంత కన్నా ఎక్కువగానో గ్రాట్యుటీని గత ప్రభుత్వాలు నిర్ణయిస్తూ వచ్చాయి. చంద్రబాబు సర్కారు మాత్రం పీఆర్సీ చేసిన సిఫార్సుల్లో రూ.రెండు లక్షల కోత విధిస్తూ గ్రాట్యుటీని ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల నుంచి రూ. పది లక్షలకే పెంచుతూ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పీఆర్సీ సిఫార్సులు 2013 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాగా ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీ పెంపు మాత్రం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే జూలై 2013వ తేదీ నుంచి జూలై 2014 మధ్య పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి గతంలో ఉన్న రూ.8 లక్షలే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శుక్రవారం తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ రూ. పది లక్షల వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. పదవీ విరమణ చేసిన తరువాత ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని రూ. పది లక్షలకే పరిమితం చేస్తూ ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ‘సాక్షి’ ముందుగానే తెలియజేసిన విషయం తెలిసిందే. ‘ఇక గ్రాట్యుటీ వంతు’ శీర్షికన గ్రాట్యుటీ గరిష్ట పరిమితికి కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని గత వారం ‘సాక్షి’ వార్త ప్రచురించింది. తొమ్మిదవ వేతన సవరణ కమిషన్ గ్రాట్యుటీ రూ.ఆరు లక్షలు ఇవ్వాలని సిఫార్సు చేయగా అప్పటి ప్రభుత్వం అదనంగా మరో రూ.రెండు లక్షలు పెంచుతూ గ్రాట్యుటీ రూ. 8 లక్షలు చేసింది. ఇప్పుడు పీఆర్సీ సిఫార్సు చేసినంత కూడా ఇవ్వకుండా తగ్గించడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. లక్షల మొత్తంలో కోల్పోతామంటున్నారు.
కోతను అంగీకరించం
ఉద్యోగుల గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ. 10 లక్షలుగా నిర్ణయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రశ్నేలేదు. పీఆర్సీసిఫార్సుల ప్రకారం గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాల్సిందే. త్వరలోనే మేము సీఎంను, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచాలని డిమాండు చేస్తాం. పీఆర్సీ సిఫార్సులకు విరుద్ధంగా గ్రాట్యుటీని రూ. 10 లక్షలకు పరిమితం చేయడం ఉద్యోగులకు అన్యాయం చేయడమే. దీన్ని అంగీకరించం.
- చంద్రశేఖర్‌రెడ్డి,జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్