ఆయకట్టు.. బీడు పెట్టు.. | handri-niva water today came from Gollapalli | Sakshi
Sakshi News home page

ఆయకట్టు.. బీడు పెట్టు..

Published Fri, Dec 2 2016 12:55 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

handri-niva water today came from Gollapalli

  • ఐదేళ్లుగా జీడిపల్లికి.. నేటి నుంచి గొల్లపల్లికి హంద్రీ–నీవా నీరు
  • అయినా ఆయకట్టుకు వదలని ప్రభుత్వం
  • డిస్ట్రిబ్యూటరీ పనులపై నిర్లిప్తత
  • కుప్పానికి తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇవ్వలేమని తేల్చిచెప్పిన చంద్రబాబు
  • ఈ ఏడాది ఇప్పటి వరకూ హంద్రీ–నీవాకు 20 టీఎంసీలు...ఖర్చు రూ.240 కోట్లు
  • డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరిస్తేనే 'అనంత'కు ఉపయుక్తం
  • నేడు గొల్లపల్లికి సీఎం చంద్రబాబు రాక


  • 'బావా.. ఈరోజు కోడికూర తిందాం రా!’..  'కోడి ఎక్కడుంది బావా?! తట్టలో అన్నం మాత్రమే ఉంటేనూ!’.. ‘ఇదిగో పైన కోడి! దాన్ని చూస్తూ..కోడికూర తిన్నట్లుగా ఆస్వాదిస్తూ అన్నం తినేయాలి  బావా!'..
                – ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావు మధ్య సంభాషణ ఇది.
        అచ్చం ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా టీడీపీ నేతల పరిస్థితి. ‘ఇవిగో నీళ్లు..వీటితో రైతుల జీవితాలు సస్యశ్యామలం అవుతాయి.. జిల్లా నుంచి కరువును పూర్తిగా తరిమికొడతాం. కరువు భయపడేలా చేస్తాం..’అని పదేపదే వల్లెవేస్తున్నారు. ఐదేళ్లుగా కళ్లెదుట కృష్ణాజలాలు ఉన్నాయి.  ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు ఇవ్వడంలేదు. నీళ్లు చూపించి...వాటితో రైతుల జీవితాలు బాగుపడతాయనేలా భ్రమింపజేస్తూ 'అనంత' రైతులను ప్రభుత్వం నిట్టనిలువునా  మోసం చేస్తోంది. 'హంద్రీ–నీవా కాలువ వస్తే  నీళ్లొస్తాయి! కాలువకు కొంత పొలం పోయినా, ఉన్న దాంట్లో పంటలు పండించుకోవచ్చు. మా బతుకులు బాగుపడతాయి' అని వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. అనుకున్నట్లుగానే 2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వచ్చాయి. నాలుగురోజులుగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు కూడా నీటి విడుదల మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు  ఈరోజు(శుక్రవారం) గొల్లపల్లిలో గంగపూజ చేయనున్నారు.


    పూజలతో బతుకు పండుతుందా 'బాబూ'..
        రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 'అనంత'లో గంగపూజలతో టీడీపీ నేతలు హల్‌చల్‌ చేస్తున్నారు.  కృష్ణాజలాలను ఇష్టానుసారంగా తీసుకెళ్లడం, కుంటలు, చెరువుల్లో నింపి, వంకల్లో పారిస్తూ గంగపూజలు చేస్తున్నారు. కానీ ఎకరాకైనా నీళ్లిచ్చి పంటలను కాపాడదామనే ఆలోచన చేయలేదు. చివరకు బాధ్యత గల ముఖ్యమంత్రి కూడా ఇదే పంథా అనుసరిస్తున్నారు. గొల్లపల్లికి వచ్చి కృష్ణమ్మకు గంగపూజ చేయనున్నారు. పూజలు స్వీకరించిన కృష్ణమ్మ కాలువల వెంబడి బిరబిరా పరుగెడుతూ రైతులకు బంగరు పంటలు పండించాలి. కానీ కృష్ణమ్మ పొలాల వైపు వెళ్లకుండా చంద్రబాబు అడ్డుకట్ట వేస్తున్నారు.ఎంతకాలమైనా సరే కుప్పం వరకూ ప్రధాన కాలువ తవ్వాలి.. మధ్యలోని రిజర్వాయర్లు పూర్తి కావాలి.. అక్కడికి నీళ్లు తీసుకెళ్లాలి.. ఆ తర్వాతే 'అనంత' రైతులకు నీరు ఇవ్వాలా, వద్దా అనేది ఆలోచిస్తామన్న ధోరణితో ఉన్నారు. ఈ మాటను ఈ ఏడాది సెప్టెంబరు 1న జిల్లాలో చెప్పారు కూడా! దీనిపై పల్లెత్తు మాట అనకుండా జిల్లా రైతుల ప్రయోజనాలను చంద్రబాబు కాళ్లముందు తాకట్టుపెట్టారు మన ఘనత వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 20 టీఎంసీల కృష్ణాజలాలు జిల్లాకు చేరాయి.  ఇందుకోసం రూ.240 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ నీటితో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. కానీ ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువ పరిధిలో రెండు ఎకరాలకు కూడా  ఇవ్వలేదు. మరో రెండేళ్లయినా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో  నీళ్లు జీడిపల్లిలో ఉన్నా..గొల్లపల్లిలో ఉన్నా..రేపు చెర్లోపల్లిలో ఉన్నా ప్రయోజనం ఉండదు.


    హెచ్చెల్సీకి ఉపకాలువలుగా ఉపయోగించనున్నారా?
                హంద్రీ–నీవా ద్వారా ఫేజ్‌–1, ఫేజ్‌–2లో 3.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. ఇందులో ఫేజ్‌–1లో 1.18 లక్షలు, ఫేజ్‌-2లో 2.27లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఫేజ్‌–1 పనులు 2012లో పూర్తయినా ఆయకట్టుకు నీరివ్వలేదు. గొల్లపల్లి ఫేజ్‌–2లోకి వస్తుంది. ఇక జిల్లాలో మిగిలింది చెర్లోపల్లి రిజర్వాయర్‌, మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌. ఈ రెండింటికి నీళ్లిస్తే జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయినట్లే. కానీ చంద్రబాబు అనుకున్నట్లు కుప్పం వరకూ నీళ్లు వెళ్లాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. భారీ టన్నెల్స్, అక్విడెక్టులతో పాటు చాలా నిర్మాణాలున్నాయి. అప్పటి వరకూ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. 2012 నుంచి హంద్రీ–నీవా నీళ్లు పీఏబీఆర్‌కు మళ్లిస్తున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ నేతలు చెరువుల పేరుతో ఇష్టానుసారం తీసుకెళుతున్నారు. పోనీ చెరువుల కింద ఉన్న ఆయకట్టుకైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఈ నీళ్లు ఆయకట్టుకు వాడుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాలుగేళ్లుగా హంద్రీ–నీవా నీటి వినియోగం, చంద్రబాబు తీరు నిశితంగా పరిశీలిస్తే హంద్రీ–నీవాను హెచ్చెల్సీకి ఉపకాలువగా మార్చడం మినహా స్థిరీకరించిన ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి వద్ద గట్టిగా గళం విప్పి, డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయించి  జిల్లా రైతుల అవసరాలు, హక్కులను కాపాడాల్సిన అవసరముందని విపక్షనేతలు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement